
హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి పీజీ విద్యార్థి కాట్రావత్ సురేష్ కుమార్ (26) ఆత్మహత్య కేసు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన సురేష్‌కు పీజీ నీట్ ద్వారా ఉస్మానియాలో సర్జరీ విభాగంలో సీటు వచ్చింది. అయితే అతడు జనరల్ మెడిసిన్‌లో సీటు వస్తుందని ఆశపడ్డాడని, సర్జరీ కోర్సుపై ఆసక్తి లేకపోవడంతో నిరాశకు గురైనట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. కోర్సు మార్చుకోవడానికి చివరి వరకు ప్రయత్నించినా, మూడు రౌండ్ల కౌన్సెలింగ్‌లోనూ సాధ్యం కాలేదు. నిబంధనల ప్రకారం కోర్సు మధ్యలో వదిలివేయాలంటే భారీ మొత్తం చెల్లించాల్సి ఉండటంతో సురేష్ మరింత ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లోనే అతడు డిప్రెషన్‌కు గురయ్యి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ఇక ఘటన జరిగిన రోజున, సురేష్ అధిక మోతాదులో ఇంజెక్షన్లు, మాత్రలు తీసుకుని హాస్టల్ గదిలో అచేతనంగా పడిపోయాడు. ఉదయం కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్నేహితులు వెళ్లి చూడగా అతడు అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సురేష్ కుటుంబ సభ్యులు, సహ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. సీనియర్లు అధిక పని ఒత్తిడి, సుదీర్ఘ డ్యూటీలతో వేధించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ర్యాగింగ్ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం పోలీసులు సురేష్ సెల్‌ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. కాల్ రికార్డులు, మెసేజులు, సోషల్ మీడియా వివరాలు పరిశీలిస్తున్నారు. అలాగే సీసీ ఫుటేజ్ సేకరించి, తోటి విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. అఫ్జల్‌గంజ్ పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మృతి కింద నమోదు చేసి, ఒత్తిడి, కోర్సు అసంతృప్తి, ర్యాగింగ్ వంటి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలను కూడా సీరియస్‌గా తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
Also Read: సావిత్రి చివరి రోజుల్లో కోమాలో అచేతనంగా ఉన్నప్పుడు వెళ్లిన ఒకే ఒక్క తెలుగు నటి ఎవరంటే..