Onion Prices: ‘ఉల్లి’ రైతు కంట కన్నీరు.. భారీగా ధరలు పతనం.. కేజీ ఎంతంటే.?
ఉల్లి మరోసారి రైతు కంట కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉల్లి ధర రోజురోజుకీ పతనమవుతుండడంతో లబోదిబోమంటున్నారు ఉల్లి రైతులు. పెట్టిన పెట్టుబడి కూడా రాక ఆందోళన చెందుతున్నారు. కనీస మద్దతు ధర సైతం దక్కకపోవడంతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉల్లి రైతులు.
ఉల్లి మరోసారి రైతు కంట కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉల్లి ధర రోజురోజుకీ పతనమవుతుండడంతో లబోదిబోమంటున్నారు ఉల్లి రైతులు. పెట్టిన పెట్టుబడి కూడా రాక ఆందోళన చెందుతున్నారు. కనీస మద్దతు ధర సైతం దక్కకపోవడంతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉల్లి రైతులు.
పండించిన రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది ఉల్లి. మొన్నటివరకు కొంత మద్దతు ధర ఉన్నప్పటికీ.. ఇప్పుడు పూర్తిగా పతనం కావడంతో ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్, రేగొడు, జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉల్లి పంటను ఎక్కువగా సాగు చేస్తారు రైతులు. ఎకరా విస్తీర్ణంలో ఉల్లి పంటను సాగు చేయడానికి సుమారు 60 వేల నుంచి 70 వేల వరకు ఖర్చవుతుంది. గతేడాది ఎకరాకు 100 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అలాగే.. ధర కూడా క్వింటాల్‌కు అత్యధికంగా 6వేల వరకు పలికింది. అయితే.. ఈ సారి వాతావరణ మార్పులతో దిగుబడి 70 నుంచి 80 క్వింటాళ్లకు మించడం లేదు. అటు.. ధర కూడా భారీగా పతనమవుతోంది. నెల క్రితం మార్కెట్‌లో ఉల్లిగడ్డ క్వింటాల్‌కు 3వేల వరకు పలికింది. కానీ.. క్రమంగా ధరలు పతనమవుతూ ప్రస్తుతం క్వింటాలుకు 1,200 నుంచి 1,400 రూపాయలు మాత్రమే ధర పలుకుతోంది. దాంతో.. ఉల్లి రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని దుస్థితి నెలకొంది. ఇక.. తాను రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తే లక్ష ఖర్చు అయిందని.. కానీ.. పంట చేతికొచ్చి సరుకు అమ్మితే.. 60నుంచి 70వేల వరకు లాస్ వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉల్లి రైతు పగిడిపల్లి హనుమంతప్ప.
మరోవైపు.. పంట చేతికి వచ్చే సమయంలో ధరలు తగ్గిపోయాయని వాపోతున్నారు ఉల్లి రైతులు. స్థానికంగా ఉల్లి నిల్వకు సౌకర్యాలు లేకపోవడం కూడా ఇబ్బందిగా మారిందంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో కొనుగోలు చేసిన పంటను పక్క రాష్ట్రాలకు తరలించి వ్యాపారులు లాభాలు పొందుతున్నారు కానీ.. రైతు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నాడని ఆవేదన చెందుతున్నారు. లాభాలు వస్తాయని ఉల్లిని సాగు చేస్తే ఖర్చులు కూడా రావడం లేదంటూ ఉసూరుమంటున్నారు రైతులు. మొన్నటివరకు మార్కెట్‌లో కిలో ఉల్లి ధర 30 ఉంటే.. ఇప్పుడు 12 రూపాయలకు చేరడం బాధ కలిగిస్తోందంటున్నారు. ఇలా.. వేసిన పంటకు పెట్టుబడి కూడా రావడం లేదని.. పత్తి మాదిరిగానే ఉల్లిని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటున్నారు ఉల్లి రైతులు.
మొత్తంగా.. లాభాలు ఏమో గానీ.. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. అష్టకష్టాలు పడి పండించిన పంట ధర ఒక్కసారిగా పడిపోవడంతో దిగులు చెందుతున్నారు ఉల్లి రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని సంగారెడ్డి జిల్లా ఉల్లి రైతులు వేడుకుంటున్నారు.