రాష్ట్రమంతా గృహజ్యోతి పథకం అమలు జరుగుతుంటే ఆ జిల్లాలో మాత్రం వాయిదా పడింది. మిగిలిన ప్రాంతాల్లో లబ్ధిదారులు 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతుంటే పాలమూరు జిల్లా ప్రజలు మాత్రం మరో మూడు నెలలు ఆగాల్సిందే. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో కొత్త పథకాలు అమలు నిలిచిపోయింది. జీరో బిల్లులు కాకుండా గతంలో మాదిరిగానే పాలమూరు జిల్లా ప్రజలు ఎన్ని యూనిట్ల విద్యుత్ వాడుకుంటే అంతకు బిల్లు కట్టాల్సిందే. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉచిత కరెంట్ పథకం అమలునకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఫిబ్రవరి 27న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ప్రభుత్వ కొత్త పథకాలు అమలు చేసేందుకు వీలు లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి జీరో బిల్లును ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మినహా మిగతా ప్రాంతాల్లో పథకం అమలుకు విద్యుత్ శాఖ శ్రీకారం చుట్టింది.
గత నెల 27 నుంచి ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఉపఎన్నికల కోడ్ అమలులో ఉంది. మార్చి 28న ఎన్నికల జరుగుతాయి. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు చేస్తారు. ఈ ఎన్నికల కోడ్ నడుస్తుండగానే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో మరో మూడు నెలల పాటు ఉచిత కరెంట్ పథకానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. ఇతర జిల్లాలో ఈ పథకం కొనసాగుతుంటుంది. కానీ పాలమూరు జిల్లాలో మాత్రం అమలు సాధ్యం కాదు. ఇతర జిల్లాలో పథకం అమలుతో లబ్ధిదారులు సంతోషంగా ఉంటే ఉమ్మడి జిల్లాలో మాత్రం పథకం అమలు కాక ప్రజలు నిరాశలో పడ్డారు. కోడ్ ఉండే మూడు నెలలు బిల్లులు ఉమ్మడి జిల్లా ప్రజలు కట్టాల్సిందేనని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మూడు నెలలు బిల్లులకు సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూస్తున్నామని అంటున్నారు. బిల్లులు కట్టకుండా వదిలేస్తారా లేక రిఫండ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తారా వేచి చూడాల్సిందే. ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు ఉమ్మడి జిల్లాలో విద్యుత్ బిల్లులు యథావిధిగా రానున్నాయి. ఇతర జిల్లాలో మాదిరిగా జీరో బిల్లులు మహబూబ్నగర్ జిల్లాలో విద్యుత్ సిబ్బంది ఇవ్వలేరని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.