ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ శుక్రవారం తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఒడిశాలోని పలువురు నేతలు కూడా కారెక్కారు. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రారంభం నుంచి కూడా అంతా శుభఫలితాలే కలుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్‌ను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ వేగవంతంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఇతర పార్టీల నేతలను కూడా తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ నేతలతో పాటు ప్రస్తుతం ఇతర పార్టీలలో కొనసాగుతున్న అసంతృప్త నేతలను కూడా బీఆర్ఎస్‌లో చేరాలని కోరుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్‌ను విస్తరించిన కేసీఆర్.. ఇప్పుడు ఒడిశా వైపు తన దృష్టిని సారించారు. ఆ క్రమంలోనే శుక్రవారం(జనవరి 27) ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ సహా పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
అంతకముందు తెలంగాణ ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయిన గిరిధర్ గమాంగ్.. సాయంత్రం 4 గంటల సమయంలో కేసీఆర్ సమక్షంలోనే కారెక్కారు. గమాంగ్‌తో పాటు ఆయన కుమరుడు శిశిర్ గమాంగ్ కూడా గులాబీ గూటికి చేరారు. ఇంకా ఆ సమయంలోనే పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరినట్లు సమాచారం. 1972 నుంచి 2004 మధ్య కాంగ్రెస్ ఎంపీగా 9 సార్లు ఎంపీగా గెలిచిన గిరిధర్ గమాంగ్.. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్ 6 వరకు ఒడిశా సీఎంగా పనిచేశారు. ఎంపీగా ఉంటూనే ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు.
అయితే 2015లో కాంగ్రెస్‌ను వదిలి గమాంగ్ బీజేపీలో చేరారు. బీజేపీలో తమను అవమానించారని, అందుకే ఆ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. ఒడిశా రాష్ట్ర అభివృద్ది గురించి బీజేపీ పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అలాగే ఒడిశాలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఒడిశా పీసీసీ కార్యదర్శి కైలాశ్ కుమార్ ముఖి హస్తం పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన.. బీఆర్ఎస్‌లో చేరారు. ఒడిశా నుంచి మాజీ ఎంపీ జయరాం పాంగి కూడా బీఆర్ఎస్‌లో చేరనున్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరమని జయరాం పాంగి పేర్కొన్నారు. ఇక శుక్రవారం గులాబీ కండువా కప్పుకున్న గిరిధర్ గమాంగ్‌ను ఒడిశా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రకటించే అవకాశముంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..