Son’s Love For Mother: కొండగట్టు ఆంజనేయుని దర్శించుకోవడానికి కన్నతల్లిని తీసుకుని దాదాపు 100 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాడో కొడుకు. కన్నతల్లి ఆరోగ్యం కోసం ఆ నిరుపేద కొడుకు తాపత్రయం అందరినీ ఆకట్టుకుంటోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన మల్లయ్య తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. లక్షలు పోసి వైద్యం చేయించే పరిస్ధితిలో మల్లయ్య లేడు. కనీసం కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో కొద్దిరోజులు వుంటే తల్లి ఆరోగ్యం బాగుపడుతుందని మల్లయ్య భావించాడు. కానీ ఏదో వాహనంలోనో తల్లిని కొండగట్టుకు తీసుకువెళ్లే ఆర్ధిక స్తోమత కూడా అతనికి లేదు. అలాగని తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటూ చూస్తూ వుండలేకపోయాడు.
మరి ఏం చేయాలా అని మదనపడుతున్న సమయంలో మల్లయ్యకు ఓ ఆలోచన వచ్చింది. స్వయంగా తానే చెక్కలతో ఓ వాహనాన్ని తయారుచేసుకున్నాడు. నడవలేని స్థితిలో వున్న తల్లిని ఆ బండిలో కూర్చోబెట్టి తోసుకుంటూ కొండగట్టుకు బయలుదేరాడు. ఇలా దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని కొండగట్టుకు చేరి ఆంజనేయస్వామి సన్నిధిలో నెలరోజులు ఉండి తిరుగు ప్రయాణమయ్యాడు మల్లయ్య. తన ప్రయాణంపై ప్రశ్నించినవారితో.. డబ్బులు లేకపోయినా తల్లిపై ప్రేమ వుందని.. అదే తనను నడిపిస్తోందన్నాడు మల్లయ్య. తల్లి ఆరోగ్యం బాగుపడాలనే ఇదంతా చేస్తున్నానన్నాడు. తల్లి ఆరోగ్యం కోసం ఎక్కడికయినా వెళతానని చెప్పాడు.
ఇలా తల్లిపై ప్రేమతో ఆ కొడుకు అభినవ శ్రవణ కుమారుడిగా మారాడు. ఈ విధంగా ఎర్రటి ఎండలో బండి తోసుకుంటూ రానుపోను దాదాపు 200 కిలోమీటర్లు మల్లయ్య చేస్తున్న ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. తల్లదండ్రుల్ని బరువుగా భావించే కొడుకులే ఎక్కువగా కనపడుతున్న సమాజంలో తన తల్లిపై మల్లయ్య చూపిస్తున్న ప్రేమ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..