KCR: కష్టపడే వారికే పదవులు.. వచ్చే రెండేళ్లు బీఆర్ఎస్‌కు చాలా కీలకం: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
వచ్చే రెండేళ్లు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకమని పార్టీ చీఫ్ కే చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై పోరాటమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లాలని నేతలకు సూచించారు. పనిచేసే వారికే పార్టీ పదవులు ఇవ్వాలని స్పష్టం చేసిన కేసీఆర్.. రైతులు, యువత, విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ఇక ఎత్తండి గులాబీ జెండా.. ప్రజా సమస్యలే ఎజెండా.. నేతలంతా ఇక మీదట ప్రజాక్షేత్రంలోనే ఉండాలని ఆదేశించారు గులాబీ బాస్ కేసీఆర్. రైతులు, యువత సమస్యలపై దృష్టిసారించి ప్రత్యేక పోరాట కార్యచరణ రూపొందించాలన్నారు. వచ్చే రెండేళ్లు పార్టీకి కీలకమన్న మాజీ సీఎం ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని నేతలకు ఆదేశాలిచ్చారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (కే చంద్రశేఖర్ రావు) ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ పటిష్ఠతపై కీలక సూచనలు చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, ఇన్‌చార్జ్‌ల నియామకంపై నేతలకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే రెండేళ్లు పార్టీకి కీలకమన్న కేసీఆర్.. ప్రజా సమస్యలే ఎజెండాగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలన్నారు. తెలంగాణలో ఒక్కో జిల్లాలో ఒక్కో సమస్య ఉందన్నారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టాలని నేతలను సూచించారు. అన్నదాతల కష్టాలు, విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల సమస్యలపై ఎంత గట్టిగా కొట్లాడితే పార్టీకి అంత ఎక్కువ ఆదరణ లభిస్తుందన్నారు కేసీఆర్.
పనిచేసే వారినే పార్టీ ఇంచార్జులుగా నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నియోజకవర్గాలు, జిల్లాల ఇంచార్జుల ఎంపిక విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తామన్నారు. పదేళ్లలో పార్టీ పదవులు పొందని వారికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. పార్టీ పదవుల్లో బంధువులు, తెలిసినవారికి కాకుండా పనిచేసేవారికే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. యువ సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాల్లో యాక్టివ్‌గా ఉన్నవారికి పదవులివ్వాలన్నారు కేసీఆర్.
పార్టీ సభ్యత్వం విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు కేసీఆర్. ఎంత ఎక్కువ మందికి సభ్యత్వం ఇచ్చామని కాదు.. పార్టీతో నిత్యం ఉండేవారికి ఎంతమందికి ఇచ్చామన్నది ముఖ్యమన్నారు కేసీఆర్. క్రియాశీలకంగా పనిచేసేవారికే క్రియాశీల సభ్యత్వం ఇవ్వాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్.
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కనెక్టివిటీ ఉండేలా పార్టీ చైన్ ఉండాలన్నారు కేసీఆర్. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పార్టీ నేతలకు అందుబాటులో ఉండాలన్నారు.
పార్టీ వీక్‌గా ఉన్న నియోజకవర్గాలపై ఎక్కువ ఫోకస్ చేయాలన్నారు మాజీ సీఎం. త్వరలో జరగనున్న జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు, GHMC ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాలని నేతలకు కేసీఆర్ సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
