AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కూతురు కోసం ఆ మాజీ పోలీస్ అధికారి ఏం చేశాడంటే…?

పిల్లల బాగోగుల కోసం తల్లిదండ్రులు పరితపిస్తుంటారు. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతారు. తన కూతురు కోసం ఓ మాజీ పోలీస్ అధికారి.. సినిమాను తలపించేలా మాస్టర్ మైండ్‌తో స్కెచ్ వేశాడు. ఆ అధికారి ఏం చేశాడు...? చివరికి ఏమైందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: కూతురు కోసం ఆ మాజీ పోలీస్ అధికారి ఏం చేశాడంటే...?
Telangana Police
M Revan Reddy
| Edited By: Ram Naramaneni|

Updated on: Apr 17, 2025 | 11:11 AM

Share

నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన గద్దపాటి సురేష్‌ నల్లగొండలోని రామగిరిలో మణికంఠ కలర్‌ ల్యాబ్‌ నిర్వహిస్తున్నాడు. అతని తమ్ముడు నరేష్‌కు హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ ఎక్సైజ్‌ సీఐ మాతరి వెంకటయ్య కుమార్తె ఉమామహేశ్వరితో 2017లో వివాహం జరిగింది. కొన్నాళ్లపాటు సజావుగా సాగిన వీరి సంసారంలో గొడవలు జరుగుతున్నాయి. నరేశ్‌.. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకొని.. భార్యను దూరం పెడుతున్నాడు.. ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అయితే తన కుమార్తె సంసారం నాశనం కావడానికి అల్లుడి సోదరుడు సురేష్ ప్రధాన కారణమని మాజీ పోలీస్ అధికారి భావించాడు. తన అల్లుడు నరేష్‌పై గతంలో నేవీలో పనిచేసి రిటైర్‌ అయి.. హైదరాబాద్ కొత్తపేటలో స్కౌట్‌ డిటెక్టివ్‌ ఎజెన్సీ నడుపుతున్న చిక్కు కిరణ్‌ కుమార్‌‌తో నిఘా పెట్టించాడు. తన అల్లుడు నరేష్‌ మరో మహిళతో సహజీవనం చేస్తూ ఒక పాపను కూడా కన్నాడని తెలిసింది. తన అల్లుడైన నరేష్‌ వివాహేతర సంబంధాన్ని సురేష్‌ ప్రోత్సహిస్తున్నాడని నమ్మిన వెంకటయ్య ఎలాగైనా సురేష్‌ను అంతమొందిస్తే తన అల్లుడు దారికి వచ్చి కుమార్తెతో సఖ్యతగా ఉంటాడని భావించాడు.

సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం..

సురేష్‌ను అంతం చేయడానికి కూతురు ఉమామహేశ్వరి కూడా ఓకే చెప్పడంతో మాజీ పోలీసు అధికారి స్కెచ్ వేశాడు. సురేష్ హత్యకు డిటెక్టివ్‌ కిరణ్‌ కుమార్‌‌తో రూ.15 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్సుగా రూ.2లక్షలు ఇచ్చా రు. కిరణ్‌ కుమార్‌ తన బంధువైన ముషం జగదీశ్‌కు రూ.3లక్షలు ఇస్తానని చెప్పి తన పథకంలో భాగస్వామిగా చేసుకున్నాడు. ఈ క్రమంలో నెలరోజులుగా నల్లగొండలో రెక్కీ నిర్వహిస్తూ గీతాంజలి అపార్ట్‌మెంట్‌లో మణికంఠ కలర్‌ ల్యాబ్‌ నిర్వహిస్తున్న సురేష్‌ కదలికలను కనిపెడుతూ వచ్చారు.

ఈనెల 11న దారుణ హత్య..

సురేష్ కదలికలపై నెల రోజులుగా రెక్కీ నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ హైదరాబాదు నుంచి కారులో చెర్వుగట్టు వరకు వచ్చాడు. హత్యకు అవసరమైన కత్తులు, మాస్కులు, టోపీలు, గ్లౌజ్‌లను వెంట తెచ్చుకున్నాడు. చెర్వుగట్టు వద్ద ఉన్న ముశం జగదీశ్‌తో కలిసి బైక్‌పై చర్లపల్లి వరకు… అక్కడ నుంచి ఆటోలో రాత్రి 10 గంటలకు రామగిరి చేరుకున్నారు. పథకం ప్రకారం సురేష్ షాపు వెనకాల అప్పటికే ఉంచిన బైక్‌ తీసుకుని 10.45గంటలకు కలర్‌ ల్యాబ్‌ వద్దకు వచ్చారు. తమకు ఫొటోలు, ప్రింట్లు కావాలని సురేష్‌ను నిందితులిద్దరూ అడిగారు. అర్జెంటుగా కావాలని రిక్వెస్ట్ చేయడంతో ఫొటోలు ప్రింట్‌ ఇచ్చే పనిలో సురేష్‌ నిమగ్నమయ్యాడు. ఇదే అదునుగా భావించిన కిరణ్‌కుమార్‌, జగదీశ్‌‌లు కత్తులతో సురేష్‌ గొంతు కోసి వీపు, పొట్ట భాగంపై దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో అక్కడికడే సురేష్ చనిపోయాడు. ఘటన స్థలం నుంచి బైక్‌పై నిందితులు హైదరాబాద్‌కు పారిపోయారని పోలీసులు చెబుతున్నారు.

మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నల్లగొండ టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ఈ హత్యకు స్కెచ్ వేసిన నరేష్‌ మామ మాజీ పోలీస్ అధికారి వెంకటయ్య(ఏ1 ), డిటెక్టివ్ చిక్కు కిరణ్‌కుమార్‌(ఏ2 ), ముశం జగదీశ్‌(ఏ3 ), నరేష్‌ భార్య ఉమామహేశ్వరి(ఏ4)లను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నిందితుల నుండి కారు, రెండు బైక్ లు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..