
ఫ్రెండ్ కోసం యువకుడు ఇంటి నుండి బయటకు వెళ్ళాడు. ఏమైందో.. ఏమో కానీ.. తెల్లవారేసరికి శవమయ్యాడు. డిగ్రీ చదువుతున్న యువకుడి అనుమానస్పద మృతి కలకలం రేపింది. ఈ ఘటనకు కారణమేంటి..? ఆ యువకుడికి ఏమైంది..? అనేది మిస్టరీగా మారింది.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల ప్రకారం..
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన మాదగోని సత్యనారాయణ, నాగమణి దంపతులు 6వ వార్డు ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్నారు. వీరి కుమారుడు
ఈశ్వర్ స్థానికంగా డిగ్రీ చదువుతున్నాడు. డిగ్రీ కాలేజీకి సమీపంలోని సుందర్ నగర్ కాలనీలో ఈశ్వర్ అమ్మమ్మ ఇల్లు ఉంది. దీంతో ఈశ్వర్ కొంత కాలంగా తన అమ్మమ్మ ఇంటి వద్ద నుండి కాలేజీకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఈశ్వర్.. సాయంత్రం స్నేహితుడి ద్విచక్ర వాహనంపై ఇందిరమ్మ కాలనీకి వెళ్లాడు. అయితే.. ఈశ్వర్ రాత్రి ఇంటికి రాలేదు.. ఏమైందో ఏమో కానీ చింతపల్లి రోడ్డులో రహదారి మధ్యలో శవమై కనిపించాడు.
ఈ రోడ్డులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈశ్వర్ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..