AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Politics: భావోద్వేగంగా బోధన్‌ రాజకీయం.. ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇకముందు మరో లెక్క..

ఇంతదూరమొచ్చాక దూద్‌కా దూద్‌.. పానీకా పానీ. పోరాడితే పోయేదేంలేదు సీటు తప్ప అనుకున్నట్లున్నారు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే. అందుకే తగ్గేదే లేదంటున్నారు. ఇన్నాళ్లూ లోకల్‌ లీడర్స్‌తోనే బోధన్‌మే సవాల్‌ అన్న ఆ ఎమ్మెల్యే.. ఇప్పుడు మజ్లిస్‌ బాస్‌పైనే తొడగొడుతున్నారు. మ్యాటర్‌ ఔటాఫ్‌ కంట్రోలా? షకీల్‌ ఎపిసోడ్‌తో BRS- MIM మధ్య గ్యాప్‌ పెరుగుతోందా?

Telangana Politics: భావోద్వేగంగా బోధన్‌ రాజకీయం.. ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇకముందు మరో లెక్క..
Shakeel Vs Mim
Sanjay Kasula
|

Updated on: Jun 30, 2023 | 10:09 PM

Share

Shakeel Vs MIM: ఇప్పటిదాకా ఓ లెక్క. ఇక మరో లెక్కంటోంది మజ్లిస్‌పార్టీ. బీఆర్‌ఎస్‌తో మొదట్నించీ స్నేహపూర్వకంగానే ఉన్న ఎంఐఎం.. వచ్చే ఎన్నికల్లో సీన్‌ వేరేలా ఉంటుందన్న సంకేతాలిస్తోంది. అసెంబ్లీ సాక్షిగా గతంలో అక్బరుద్దీన్‌ చెప్పినమాటలే ఇప్పుడాయన అన్న నోటినుంచి వస్తున్నాయ్‌. రెండుపార్టీలమధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది బోధన్‌ ఎపిసోడ్‌. విచిత్రంగా అక్కడినుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మైనారిటీ ఎమ్మెల్యేనే టార్గెట్‌ చేసుకున్నారు అసదుద్దీన్‌. దీంతో ఇప్పటిదాకా బోధన్‌ ఎంఐఎం నేతలతోనే తలపడుతూ వచ్చిన ఎమ్మెల్యే షకీల్‌ ఇప్పుడు ఏకంగా మజ్లిస్‌ అధినేతనే టార్గెట్‌ చేసుకున్నారు. భయపడితే బెదిరేది లేదంటున్నారు.

బోధన్‌ వివాదంలో ఎంఐఎం అధినేత జోక్యంపై ఫైరయ్యారు ఎమ్మెల్యే షకీల్‌. అసదుద్దీన్‌ ఒవైసీకి స్ట్రాంగ్‌ కౌంటర్‌తో ఇంకాస్త మంటపెట్టారు. ఎంఐఎం అధినేత బ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే. దమ్ముంటే ముందు నుంచి కొట్లాడాలని.. వెనుకనుంచి వెన్నుపోటు రాజకీయాలు చేయడం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తానెవరిమీదా తప్పుడు కేసులు పెట్టలేదని, తనపై హత్యాయత్నం చేసినవారిని విడిచిపెట్టే ప్రసక్తేలేదంటున్నారు బోధన్‌ ఎమ్మెల్యే. బోధన్‌ బీఆర్‌ఎస్‌ నేత శరత్‌రెడ్డితో కలిసి ఎంఐఎం నేతలు తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు షకీల్‌. దమ్ముంటే ఎన్నికల్లో తనపై పోటీకి దిగాలన్న సవాల్‌తో మ్యాటర్‌ని ఇంకాస్త వేడెక్కించారు.

అధికార పార్టీలో ఏకైక మైనార్టీ ఎమ్మెల్యేగా 2014, 2018 ఎన్నికల్లో విజయంసాధించారు బోధన్ ఎమ్మెలే షకీల్. హ్యాట్రిక్‌ కొడతానన్న ధీమాతో ఆయన ఉన్నా నియోజకవర్గంలో పరిస్థితులు అంతకంతకూ ప్రతికూలంగా మారుతున్నాయి. సొంతపార్టీలోనే ప్రత్యర్థులు తయారయ్యారు. మరోవైపు ఎంఐఐం నేతలతో వివాదం ముదిరింది. మజ్లిస్‌ కౌన్సిలర్ల అరెస్ట్‌తో ఆ పార్టీకి టార్గెట్టయ్యారు ఎమ్మెల్యే షకీల్‌. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యేని ఎంఐఎం కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ష‌కీల్ ఇద్దరు ఎంఐఎం కౌన్సిలర్లు, ఆ పార్టీ కార్యకర్తలు కొందరు హత్యాయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు ఏడుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి పంపటంతో ఎంఐఎం అధినేత రంగంలోకి దిగారు.

నిజామాబాద్‌ జైల్లో ఎంఐఎం నేతలను పరామర్శించిన అసదుద్దీన్‌ ఒవైసీ బోధన్‌లో షకీల్‌ని ఓడించి తీరతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. బోధన్‌లో శివాజీ విగ్రహం ఆవిష్కరణ ఎపిసోడ్‌తో అప్పటిదాకా తనవెంట ఉన్న పార్టీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త శరత్ రెడ్డిని దూరంపెడుతూ వచ్చారు ఎమ్మెల్యే షకీల్‌. గతంలో తన విజయానికి కృషిచేసిన ఎంఐఎంతో వైరం ముదరటంతో బోధన్‌ ఎమ్మెల్యేకు ఇంటాబయటా సవాళ్లు పెరిగాయి. బోధన్‌లో మైనార్టీలకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. నిజామాబాద్ తర్వాత బోధన్‌ మజ్లిస్ పార్టీకి పట్టున్న నియోజకవర్గం. అలాంటిది సొంత సామాజికవర్గం నేతలనే షకీల్‌ జైలుకుపంపటంతో ఎమ్మెల్యేపై కత్తిదూసింది ఎంఐఎం. ఈ గ్యాప్‌ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి.

బీఆర్‌ఎస్‌ అధినేత కూతురు కవిత రాజకీయ కేంద్రంగా ఉన్న నిజామాబాద్‌ జిల్లాలో పరిణామాలు అధికారపార్టీకి తల్నొప్పిగా మారాయి. షకీల్‌ని టార్గెట్‌ చేసుకుంటూనే గతంలో కవిత విజయానికి ఎంఐఎం మద్దతిచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు అసదుద్దీన్‌. బోధన్‌లో ఈసారి పోటీచేసి తీరాలనుకుంటోంది మజ్లిస్‌పార్టీ. షకీల్‌ ఎపిసోడ్‌తో మరిన్ని సీట్లలో ఆ పార్టీ పోటీచేస్తే బీఆర్‌ఎస్‌కి కొంత ఇబ్బందేనన్న చర్చ జరుగుతోంది.

దీంతో బోధన్‌ ఎమ్మెల్యే విషయంలో గులాబీబాస్‌ నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరం. బోధన్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు శరత్‌రెడ్డి. షకీల్‌కి మళ్లీ టికెటిస్తే మద్దతిచ్చేది లేదని పార్టీలో ఆయన వ్యతిరేకవర్గం సంకేతాలిస్తోంది. షకీల్‌ని పక్కనపెట్టకపోతే పార్టీ వీడేలా ఉన్నారట కొందరు కీలక నాయకులు. దీంతో ఎన్నికలముందు బోధన్‌ ఎపిసోడ్‌ గులాబీపార్టీ పెద్ద సవాలుగానే ఉందంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం