
చన్గోముల్ గ్రామంలో బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అనుచరులమంటూ దళిత వ్యక్తికి చెందిన భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్గోముల్ గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి 346 సర్వే నంబర్ లో గడీల శ్రీనివాస్ నుండి నాలుగు ఎకరాల భూమి రెండు నెలల క్రితం అగ్రిమెంట్ చేసుకున్నాడు.ఈ క్రమంలో ఆ భూమికి ఫెన్సింగ్ వేస్తుండగా అదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే అనుచరులు.. బీఆర్‌ఎస్ నాయకులు తమపై దాడి చేశారని నవీన్ సహచర మిత్రులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ తో ఫెన్సింగ్ విర్రగొట్టి, కర్రలతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటికొచ్చినట్టు బూతులు తిట్టారని, తమ బైక్ కూడా తగలబెట్టారని వాపోయారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు బాధితులు. ఆ భూమితో వారికి ఎలాంటి సంబంధం లేదని.. ఎమ్మెల్యే సపోర్ట్‌తోనే వారు తమ భూమి కబ్జా చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు.
ఇదిలాఉంటే.. ఈ భూమికి సంబంధించిన ఇరువర్గాల పంచాయతీనీ స్వయంగా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఓ ఫాం హౌజ్‌లో నిర్వహించడం విశేషం. ‘జరిగిందేదో జరిగిపోయింది.. కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతారు.. ఆ భూమిని తన అనుచరులకు వదిలేయండి’ అంటూ ఎమ్మెల్యే వారికి చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి.
ఇక ఎమ్మెల్యే ఒత్తిడి వల్ల కొందరు బీఆరెస్స్ నాయకుల పేర్లు ఎఫ్ఐర్ నుండి తొలగించాలని పోలీసులు తమపై ఒత్తిడి తెస్తున్నారని బాధితులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి నాయకులు బాధితులకు బాసటగా నిలిచారు. ఈ వ్యవహారంపై స్పందించిన తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గారె వెంకటేష్.. దళితులపై దాడులకు తెగబడితే దళితులందురు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామని హెచ్చరించారు. దళితులపై వివక్ష చూపుతూ దాడులు చేసిన బీఆర్ఎస్ నాయకులపై కఠినంగా చర్యలు తీసుకొని, బాధుతులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..