గోల్డ్‌ఫిష్ కంపెనీ చరిత్ర అంతా మోసపూరితం.. భూమి తనదే అంటున్న చల్లా వెంకట్రామిరెడ్డి..
Hyderabad News: భూవివాదంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే హర్షవర్ధన్‌పై కేసులు పెట్టిన ఫిష్ గోల్డ్ ఎండీ చంద్రశేఖర్ గురించి తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ ముసుగులో మోసాలు చేయడం.. సహాయం చేసిన వాళ్లనే నిలువునా ముంచడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
![గోల్డ్‌ఫిష్ కంపెనీ చరిత్ర అంతా మోసపూరితం.. భూమి తనదే అంటున్న చల్లా వెంకట్రామిరెడ్డి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/09/gold-fish.jpg?w=1280)
హైదరాబాద్, సెప్టెంబర్ 26: చంద్రశేఖర్ వేగె.. అలియాస్ చందు. గోల్డ్ షిప్ రియల్ ఎస్టేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్.. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డితో కోకాపేటలో భూవివాదంతో తెరపైకి వచ్చిన పేరు ఇది. ఇతనేదో నిఖార్సైన రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినట్టు.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మీదనే ఫిర్యాదు చేశారు. కానీ చంద్రశేఖర్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అన్నీ మోసాలు, దందాలే. వివాదాస్పద భూములు కొనుగోలు చేయడం.. వాటిని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేయడమే వృత్తి అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహారం. కోకాపేట, నార్సింగి, రాయదుర్గం, గచ్చిబౌలిలో లిటిగెంట్ భూముల్లో వేలు పెట్టడం.. అభివృద్ధి పేరుతో వాటిని ఆధీనంలోకి తీసుకుని ఆ తర్వాత వేధింపులకు దిగడం.. 2014 నుంచి ఇతని రోజువారీ దినచర్య ఇదే.
అగ్రిమెంట్ సమయంలో ల్యాండ్‌కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుంటాడు. ఆతర్వాత వాటిని తిరిగి ఇవ్వకుండా వేధింపులకు దిగుతాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి భూ వివాదంలోనూ ఇదే జరిగింది. కోకాపేటలోని సర్వే నెంబర్ 85లో భూమిని అభివృద్ధి చేస్తానంటూ కాంట్రాక్ట్ కుదుర్చుకుని పదేళ్లయినా పనులు చేయలేదు. ఆ భూమిని ఎమ్మెల్సీ తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలోనే వివాదం నడుస్తోంది.
ఇక ప్లాట్స్, లే అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన కస్టమర్లను ఆయన పెట్టే వేధింపులు అన్నీ ఇన్నీ కావు. అనుమతులు తీసుకోడు. నిబంధనలు పాటించడు. అంతా నా ఇష్టం అన్నట్టుగా.. నాలాలు, కబ్జాలు చేసి ఇష్టారీతిన నిర్మాణాలు చేపడతాడు. ఆ తర్వాత అమాయకులకు వాటిని కట్టబెట్టి.. డబ్బులు వసూలు చేస్తాడు. ఆ తర్వాత కస్టమర్లకు సమస్య వస్తే తనకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తాడు. ప్లాట్స్ కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ చేయడు. ఒకవేళ చేసినా విపరీతంగా డబ్బులు వసూళ్లు చేస్తాడు.
ఈ చంద్రశేఖర్ చేతిలో మోసపోయిన వాళ్లలో ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే ఉన్నారు. ఓ ప్రముఖ అడ్వొకేట్‌ని కూడా నిలువునా ముంచాడు. గోపీచంద్ మేనేజర్ శ్రీకాంత్ కూడా ఇతని దగ్గర 2016లో విల్లా కొనుగోలు చేసి మోసపోయాడు. ప్రముఖ నటుడు ప్రభాస్ తమ్ముడు ప్రమోద్ కూడా ఇతని దగ్గర మోసపోయిన వాళ్ల లిస్ట్‌లో ఉన్నారు. చివరకు సొంత అన్నను కూడా మోసం చేసిన ఘనుడాయన. చివరకు ప్రాజెక్ట్‌లో సాయం చేసిన వాళ్లను కూడా వెన్నుపోటు పొడవడం ఆయన నైజం.
గతంలో మల్కంచెరువు కబ్జా కేసులో ఈ చంద్రశేఖర్‌కి శిక్ష కూడా పడింది. ఇతనిపై నార్సింగిలో 3, గచ్చిబౌలిలో 2, రాయదుర్గంలో 2, కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో 1 కేసు నమోదైంది. మొత్తంగా 15 కేసులకుపైగా ఉన్నాయి. అందులో 10 క్రిమినల్, 5 సివిల్ కేసులున్నాయి. 2021లోనే పీడీ యాక్ట్ కూడా నమోదైంది.
అధికారపార్టీకి చెందిన కాస్ట్లీ హిల్స్ ఎమ్మెల్యే ఇతని వెనుక ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రశేఖర్ చేపట్టే ప్రతి ప్రాజెక్ట్, వెంచర్‌లో ఆ ఎమ్మెల్యేకు వాటా వెళ్తుందట. ఆ ఎమ్మెల్యే అండదండలతోనే ఈ అరాచకాలకు పాల్పడుతున్నట్టు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం