ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు అత్యాధునిక హంగులతో అందుబాటులోకి తెచ్చిన కొత్త ఎక్స్‌ప్రెస్, లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్ హాజరయ్యారు. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ వీరందరితో కలిసి కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కొత్త బస్సులో కలిసి వారంతా ప్రయాణించారు.
ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొత్త బస్సులను టీఎస్ఆర్టీసీ కొనుగోలు చేయడం శుభపరిణామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్‌కు మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టిన 20 రోజుల్లోనే ఆరు కోట్ల మంది మహిళలు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులను కోనుగోలు చేసి వాటిని సీఎం శ్రీ రేవంత్ రెడ్డి చేతులు మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు.
ఒకవైపు ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తూనే.. ఉద్యోగుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణకు పెద్దపీట వేస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, సీసీఎస్ బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేస్తామన్నారు. ఆధునిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న 50 కొత్త బస్సులు నేటి నుంచి రవాణా సేవల్ని అందిస్తాయని చెబుతూ మిగతా ఏసీ/నాన్-ఏసీ స్లీపర్ కమ్ సీటర్, రాజధాని బస్సులు జనవరి 2024 చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రయాణికులకు మెరుగైన సదుపాయాల కల్పనలో గాని, సిబ్బంది సంక్షేమ విషయంలో గాని ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తుందన్నారు.
టీఎస్ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ, “ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది” అన్నారు. గతంలో 69 శాతం ఉన్న ఒ.ఆర్ ప్రస్తుతం 88 శాతం నమోదు అవుతోందని, కొన్ని డిపోలలో 100 శాతం వస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రారంభోత్సవంలో ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి, టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ఫ, సీఎంఈ రఘునాథ రావు, డీసీపీ సెంట్రల్ జోన్ శరత్ చంద్ర పవార్, జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాండు రంగ నాయక్, ఎస్బీఐ డీజీఎం విజయ నాగేంద్ర, బస్ బాడీ బిల్డర్ అసోసియేన్ ప్రెసిడెంట్ శ్రీనివాసన్, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..