విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. జులై 1 నుంచి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులుంటాయని మంత్రి స్పష్టం చేశారు. ఇంటర్, ఆపై అన్ని తరగతులకు ప్రత్యక్ష బోధన ఉంటుందని పేర్కొన్నారు. తరగతుల విషయమై బుధవారం రోజు విధివిధానాలు వెల్లడిస్తామని ప్రకటించారు.
ఇంటర్ సెకెండ్ ఇయర్ ఫలితాలు వచ్చే వారం విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇంజినీరింగ్, డిప్లమో ఫైనలియర్ పరీక్షలు జులైలో పూర్తి చేస్తామన్నారు. జులై 31లోపు డిగ్రీ, పీజీ ఫైనలియర్ పరీక్షలు కూడా పూర్తి అవుతాయన్నారు. టీచర్లు ఈ నెల 25 నుంచి విధులకు హాజరుకావాలని మంత్రి ఆదేశించారు. 18 ఏళ్లు పైబడిన విద్యార్థులకు వ్యాక్సినేషన్‌పై ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.
బుధవారం ప్రైవేట్ విద్యాసంస్థలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. గతేడాదిలాగానే ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది 30 శాతం ఫీజులు తగ్గించాలని విజ్ఞప్తి చేస్తామని మంత్రి తెలిపారు.
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలను వచ్చే వారం విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇంజినీరింగ్, డిప్లమో ఫైనలియర్ పరీక్షలు జులైలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.