ఒక కాంట్రాక్టర్ అహంకారంతోనే మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుందని, నియోజకవర్గ ప్రజలు దీనిని తిప్పగొట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.. గురువారం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు బంగారి గడ్డ నుంచి చుండూరు తహసీల్దార్ కార్యాలయం వరకు టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డితో సహా పలువురు పార్టీ అగ్రనేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ బీజేపీ, మోదీలతో పాటు రాజగోపాల్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. ‘ఇది కాంట్రాక్టర్ అహంకారానికి మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. మునుగోడు ప్రజలపై బలవంతంగా రుద్దిన ఎన్నిక ఇది. ఓ నాయకుడిని ఆయన అన్నను కొనేందుకు 18వేల కాంట్రాక్టు ఇస్తే..ఆ సొమ్ముతో అంగడి సరుకుల్లా కొనేందుకు వస్తున్నారు. కేసీఆర్ పేదోళ్లను పెద్దలుగా చేస్తే.. మోడీ పెద్దోళ్లను ఇంకా పెద్దోళ్లుగా చేస్తున్నారు. నీతి ఆయోగ్ సూచించినా రూపాయి ఇవ్వని మోడీ.. కోట్ల రూపాయలు ఓ కాంట్రాక్టర్ కు ఇచ్చారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక మునుగోడులో ఫ్లోరైడ్ రూపుమాపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కేటీఆర్ గుర్తు చేశారు ‘ ఎన్నికల ముందు, తర్వాత ఓ మాట చెప్పను. మునుగోడులో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. ఇప్పుడు కూడా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. కూసుకుంట్లను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటాను. మూడు నెలల కొకసారి ఇక్కడకు వస్తాను. ఈ నియోజకవర్గాన్ని సిరిసిల్లలా అభివృద్ధి చేసే బాధ్యత నాది’
‘ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన రాజగోపాల్‌రెడ్డి నాలుగేళ్లుగా నియోజకవర్గంలో కనిపించలేదు. రూ.18వేల కోట్లతో బీజేపీ ఆయనను కోనుగోలు చేసింది. ఒక్కో ఓటును డబ్బు పెట్టి కొంటామని రాజగోపాల్ అంటున్నారు. ఒక చిన్న కంపెనీకి ఓనర్ అయిన రాజగోపాల్‌కి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆయనే చెప్పాలి’ అంటూ ధ్వజమెత్తారు కేటీఆర్. ఆయన ప్రసంగానికి సంబంధించిన పూర్తి వీడియోను కింద చూడొచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..