తెలంగాణ రాజకీయాల్లో ఉన్నట్టుండి వేడి రాజుకుంటోంది. ఉచిత విద్యుత్ కేంద్రంగా రాజకీయ రచ్చ మొదలైంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల దుమారం రేపుతోంది. రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన ప్రకటన నేపథ్యంలో రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది బీఆర్‌ఎస్. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గ్రామాల్లో దిష్టిబొమ్మలు దహనం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పుడిప్పుడే ఊరట చెందుతున్న తెలంగాణ రైతుపై రేవంత్ పిడుగు వేశారంటూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన మంత్రి జగదీష్ రెడ్డి.. రైతులకు మొట్టమొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీయే అన్నారు.
దేశంలో వ్యవసాయాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ అని ఆరోపించారు మంత్రి జగదీష్‌రెడ్డి. చంద్రబాబు నాయుడు మాటలే రేవంత్ మాట్లాడారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ అసలు రూపాన్ని బయటపెట్టారని చెప్పారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తే మీకెందుకు ఏడుపు అంటూ జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. రైతులను మీరెందుకు శత్రువులుగా భావిస్తున్నారో చెప్పాలన్నారు. పాములు, తేళ్లు కరిచి తెలంగాణ రైతులు చావాలా? అన్నారు. రేపు మీకు ఓట్లేస్తే ఇచ్చే కానుక ఇదేనా? అంటూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. రైతుల చేనుల్లో ఎందుకు 24 గంటల కరెంట్ ఉండకూడదో చెప్పాలన్నారు. రైతుల కోసం అద్భుతమైన ఆలోచన కేసీఆర్ చేశారు అని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఈరోజు, రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..