Telangana: తెలంగాణ ప్రజలకు హరీష్ రావు గుడ్ న్యూస్.. త్వరలోనే అందుబాటులోకి 500 బస్తీ దవాఖానలు.
తెలంగాణ ప్రజలకు మంత్రి హరీష్ రావు శుభ వార్త చెప్పారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 500 బస్తీ దవాఖానలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి...

తెలంగాణ ప్రజలకు మంత్రి హరీష్ రావు శుభ వార్త చెప్పారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 500 బస్తీ దవాఖానలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి… వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రులు, నిమ్స్ కొత్త బిల్డింగ్, డయాలిసిస్ సేవలు, బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, కంటి వెలుగు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
త్వరలోనే 500 బస్తీ దవాఖానలు..
హైదరాబాద్ పరిధిలో 350, హైద్రాబాద్ బయట పట్టణాల్లో 150 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 363 బస్తీ దవాఖానలు సేవలు అందిస్తున్నాయన్నారు. మరో 57 బస్తీ దవాఖానలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. వాటిని వెంటనే ప్రారంభించాలి అధికారులను ఆదేశించారు. తుది దశలో ఉన్న మిగతా దవాఖానల పనులు వేగవంతం చేయాలన్నారు. జూన్ నెలాఖరు వరకు 500 బస్తీ దవాఖానలు పూర్తి స్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సౌకర్యార్థం ఆదివారం కూడా సేవలు అందిస్తున్నామని, అందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు సేవలు అందించాలని చెప్పారు. ఇక ఈ నెలఖారు వరకు 3206 పల్లె దవాఖనలు పూర్తి స్థాయిలో పని చేయాలని మంత్రి ఆదేశించారు.
ఆ పనులు త్వరగా పూర్తి చేయాలి..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. వరంగల్ హెల్త్ సిటీ పనులు దసరా నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రారంభించేందుకు సిద్దం చేయాలని చెప్పారు. గ్రేటర్ పరిధితోపాటు, నగర శివారు ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న సనత్ నగర్ , ఎల్బి నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. నిమ్స్ విస్తరణ పనుల్లో భాగంగా నిర్మించే 2000 పడకల బిల్డింగ్ కు పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇక నుంచి నెలవారీగా వీటి పురోగతిపై సమీక్ష చేస్తానని, అధికారులు పురోగతి నివేదికలతో సిద్దంగా ఉండాలన్నారు.




అందరికీ కంటి వెలుగు పరీక్షలు..
కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్న మంత్రి.. 67 పని దినాల్లో 1.31 కోట్ల మందికి కంటి పరీక్షలు పూర్తి చేయడం సంతోషకరమన్నారు. 3006 వార్డుల్లో (87%) , 9556 పంచాయతీల్లో (74.72%) పూర్తి చేసినట్లు చెప్పారు. 27 శాతం మందికి అద్దాలు అవసరం కాగా, సగటున ఒక్కో బృందం రోజుకు 120 మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు చెప్పారు. 19.64 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ ఇవ్వగా, 15.30 లక్షల మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ అవసరం అని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇందులో 12 లక్షల మందికి పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర సగటు (95%) కంటే తక్కువగా అద్దాలు పంపిణీ చేసిన జిల్లాల్లో ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ పంపిణీ త్వరగా పూర్తి చేయాలన్నారు. హైదరాబాదులో పంపిణీ కోసం ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించాలని జిల్లా వైద్యాధికారిని మంత్రి ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..