
హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రానికి మరోసారి వర్ష సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. ఆదివారం విదర్భ దాని సమీపంలోని మరత్వాడ ప్రాంతంలో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం సోమవారం నాటికి బలహీనపడింది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ అంచనా వేసింది.
అయితే ఇప్పటికే హైదరాబాద్ సహా పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం సోమ, మంగళ, బుధ వారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయి. అలాగే రాష్ట్రంలోని కొన్ని పశ్చిమ జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుంచి 40 కి.మీ వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. ఇలాంటి నష్టం మరోసారి జరగకుండా రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పంట పొలాల వద్ద కల్లాల్లో ధాన్యం ఉంటే వాటిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచిస్తున్నారు. అలాగే వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు విరిగి పడే అవకాశం ఉందని.. పొలాలకు వెళ్లేప్పుడు రైతులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.