AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యో రైతన్నా.. ఎంత కష్టమొచ్చే.. కళ్ల ముందే పంట మొత్తం.. వీడియో చూడండి..

రెక్కలు ముక్కలు చేసుకుని, అప్పులు తెచ్చి పండించిన పంట అది.. మరో రెండు రోజుల్లో చేతికి డబ్బులొస్తాయనుకున్న తరుణంలో విధి ఎంత దారుణంగా కన్నెర్ర జేసిందంటే.. కండ్లముందే 40 బస్తాల ధాన్యం బూడిదైపోయింది. మెదక్ జిల్లాలో అడవిలో పెట్టిన మంటల కారణంగా సర్వస్వం కోల్పోయిన ఒక సామాన్య అన్నదాత కన్నీటి గాథ ఇదీ..

Telangana: అయ్యో రైతన్నా.. ఎంత కష్టమొచ్చే.. కళ్ల ముందే పంట మొత్తం.. వీడియో చూడండి..
Massive Fire Destroys Farmers Paddy
P Shivteja
| Edited By: |

Updated on: Jun 04, 2026 | 11:51 AM

Share

గుర్తుతెలియని వ్యక్తులు చేసిన ఒక చిన్న నిర్వాకం.. అడవి ప్రాంతంలో పెట్టిన ఆ నిప్పు.. ఒక పేద రైతు జీవితాన్ని చీకట్లోకి నెట్టేసింది. చేతికందివచ్చిన పంటను అమ్ముకుందామని రోడ్డు పక్కన ఆరబెట్టుకుంటే.. ఆ ధాన్యం కుప్పను మంటలు మింగేసాయి. సుమారు 40 బస్తాలకు పైగా వడ్లు కండ్లముందే పూర్తిగా బూడిదైపోతుంటే, ఏమీ చేయలేక ఆ సదరు రైతు గుండె లబోదిబోమంది. అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే.. ఇప్పుడు అంతా బూడిదైపోయిందని, తాను ఎలా బతకాలంటూ ఆ అన్నదాత పెట్టుకున్న కన్నీటి రోదన స్థానికులను సైతం కదిలించింది. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాచారం మహేష్ అనే రైతు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని నూర్పిడి చేసి, ఆరబెట్టడం కోసం రోడ్డు పక్కన కుప్పగా పోశాడు. మరో రోజుల్లో అమ్ముకుని సొమ్ము చేసుకుందామనుకున్న తరుణంలో ఊహించని విపత్తు మంటల రూపంలో వచ్చి పడింది. సమీపంలోని అడవి ప్రాంతంలో గుర్తుతెలియని కొందరు వ్యక్తులు పెట్టిన నిప్పు కాస్తా.. క్షణాల్లో ఈ రైతు జీవితాన్ని అతలాకుతలం చేసింది.

క్షణాల్లో చుట్టేసిన మంటలు..

ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు గాలి బలంగా వీచడంతో అడవిలో మొదలైన మంటలు కాస్తా వేగంగా రోడ్డు వైపునకు వ్యాపించాయి. రోడ్డు పక్కనే ఉన్న మహేష్ ధాన్యం కుప్పకు మంటలు అంటుకున్నాయి. మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానిక రైతులు, గ్రామస్తులు వెంటనే పరుగుపరుగున వచ్చి నీళ్లు చల్లుతూ వాటిని అదుపు చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ గాలి వేగానికి మంటలు క్షణాల్లోనే వడ్ల కుప్ప మొత్తాన్ని చుట్టేయడంతో గ్రామస్తుల ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఈ ప్రమాదంలో సుమారు 40 బస్తాలకు పైగా ధాన్యం పూర్తిగా దహనమై పోయింది. చేతికందిన పంట చేజారిపోవడంతో బాధిత రైతు నాచారం మహేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఎంతో ఆశతో, ఎన్నో అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి రాత్రింబగళ్లు కష్టపడి పండించిన పంట.. ఇలా చేతికొచ్చే సమయానికి బూడిద కుప్పగా మారడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. తన కష్టమంతా బుగ్గిపాలు కావడంతో ఆ రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.

ఆదుకోవాలని విజ్ఞప్తి

ఈ ప్రమాదం వల్ల మహేష్ కుటుంబానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. అప్పులు తీర్చేదెలా? కుటుంబాన్ని పోషించుకునేదెలా? అని బాధిత రైతు నెత్తీనోరు బాదుకుంటున్నాడు. ప్రభుత్వం, జిల్లా అధికారులు తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి తమను ఆర్థికంగా ఆదుకోవాలని బాధిత రైతు మహేష్‌తో పాటు దామరంచ గ్రామస్తులు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us