AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ ఊరు ఓ పాల పుంత.. ఊరంతా పాడి పరిశ్రమే.. ఏకంగా 2,035 జెర్సీ ఆవులు, 380 పాడి గేదెలు

జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యపురం గ్రామం పాడి పరిశ్రమకు నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఒకప్పుడు కరువుతో అల్లాడి వలసలు వెళ్లిన కుటుంబాలు.. ఇప్పుడు పశుపోషణ, పాల ఉత్పత్తితో స్వయం ఉపాధి పొందుతున్నాయి. కేవలం 290 ఇళ్లున్న ఈ గ్రామంలో 2,035 జెర్సీ ఆవులు, 380 పాడి గేదెలు ఉన్నాయి.

Telangana: ఆ ఊరు ఓ పాల పుంత.. ఊరంతా పాడి పరిశ్రమే.. ఏకంగా 2,035 జెర్సీ ఆవులు, 380 పాడి గేదెలు
Dairy Farming
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Oct 08, 2026 | 5:14 PM

Share

మట్టిలో మాణిక్యాలు.. పాలతో ప్రగతి పథంలో పయనిస్తున్న పాడి రైతులు. ఎండైనా.. వానైనా.. ఎముకలు కొరికే చలైనా.. తెల్లవారక ముందే నిద్రలేచి పశువుల సంరక్షణలో నిమగ్నమయ్యే రైతులు. ఒకప్పుడు కరువు కాటుతో పూటగడవక పట్టణాలకు వలస వెళ్లిన కుటుంబాలు.. ఇప్పుడు పశుపోషణనే ప్రధాన జీవనోపాధిగా మార్చుకుని స్వయం ఉపాధితో చరిత్ర సృష్టిస్తున్నాయి. ఊరంతా ఒకే మాట.. ఒకే బాటగా పాడి పరిశ్రమను ఎంచుకుని దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం.. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యపురం.

తెల్లవారగానే ప్రతి ఇంటి గుమ్మం ముందు ఎదురుచూసే తొలి నిత్యావసర వస్తువు.. పాలు. కప్పు చాయ్ అయినా.. గ్లాసెడు పాలు అయినా.. పాలతోనే చాలామంది రోజు మొదలవుతుంది. పల్లె అయినా.. పట్టణం అయినా.. నగరం అయినా.. పాలు లేని దైనందిన జీవితం ఊహించుకోవడం కష్టం.

పాల ఉత్పత్తి, వినియోగం, విక్రయాలతో ప్రతిరోజూ దేశవ్యాప్తంగా భారీ ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. 2024-25 గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా రోజుకు సుమారు 68 కోట్ల లీటర్ల పాల అవసరం ఉందని అంచనా. లీటరు పాల సగటు ధరను రూ.50గా తీసుకుంటే.. రోజుకు దాదాపు రూ.3,395 కోట్ల విలువైన పాల విక్రయాలు జరుగుతున్నట్లు లెక్క. అంటే ఏడాదికి ముడి పాల వ్యాపారం విలువ రూ.12 లక్షల కోట్లకు పైగానే ఉంటుందన్నమాట.

ఇది కేవలం పాల విక్రయాల లెక్క మాత్రమే. పాల ఉత్పత్తి చుట్టూ నడిచే మొత్తం ఆర్థిక వ్యవస్థను చూస్తే దాని పరిధి మరింత పెద్దది. ఆవులు, గేదెల పెంపకం.. పశుగ్రాసం, దాణా.. పశువైద్యం, మందులు.. పాల సేకరణ కేంద్రాలు.. బల్క్ మిల్క్ కూలర్లు.. పాల రవాణా.. డెయిరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు.. ఆ తర్వాత పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, పన్నీర్, చీజ్, పాలపొడి, ఐస్‌క్రీమ్, స్వీట్లు.. ఇలా ఎన్నో రంగాలు పాల పరిశ్రమతో ముడిపడి ఉన్నాయి.

పాలు ఓ ఉత్పత్తి మాత్రమే కాదు.. ఓ భారీ ఉపాధి వ్యవస్థ. పాల ఉత్పత్తిపై ఆధారపడి వందలాది డెయిరీ కంపెనీలు పనిచేస్తున్నాయి. వాటిని నమ్ముకుని ఎంతోమంది ఉద్యోగ, ఉపాధి పొందుతున్నారు. కోట్లాది మంది వినియోగదారులకు ప్రతిరోజూ పాలు, పాల ఉత్పత్తులు అందుతున్నాయి.

ఈ మొత్తం వ్యవస్థకు అసలు వెన్నెముక మాత్రం పాడి రైతే. దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు అప్పుడప్పుడు విశ్రాంతి దొరకొచ్చు.. కానీ పాడి రైతుకు మాత్రం ఒక్కరోజు కూడా విరామం ఉండదు. కుండపోత వర్షం కురిసినా.. పిడుగులు పడినా.. ఎముకలు కొరికే చలి అయినా.. మండుటెండ అయినా.. పశువుల సంరక్షణ, పాల ఉత్పత్తి మాత్రం ఆగదు.

అలాంటి పాడి రైతుల కష్టానికి ప్రతిరూపంగా నిలుస్తోంది మాణిక్యపురం. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని ఈ గ్రామంలో సుమారు 290 నివాస గృహాలు, 1,180 మంది జనాభా ఉన్నారు. కానీ గ్రామంలో ఉన్న పశుసంపద చూస్తే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు. ఏకంగా 2,035 జెర్సీ ఆవులు, 380 పాడి గేదెలు ఉన్నాయి.

ఒకప్పుడు ఇదే మాణిక్యపురం నీటి కొరత, కరువుతో అల్లాడిపోయింది. బతుకుదెరువు కోసం చాలామంది పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లారు. కానీ పరిస్థితులకు లొంగిపోలేదు. సుమారు రెండు దశాబ్దాల క్రితం గ్రామంలో పాడి పరిశ్రమ వైపు అడుగులు పడటం మొదలైంది. ఒకరిని చూసి మరొకరు పశుపోషణను ఎంచుకున్నారు. చేయి చేయి కలిపి ముందుకు సాగారు. అలా వ్యక్తిగత ఉపాధి కాస్తా.. గ్రామ ఉద్యమంగా మారింది.

ఇప్పుడు మాణిక్యపురం నుంచి ప్రతిరోజూ 3 వేల లీటర్లకు పైగా పాలు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో సుమారు వెయ్యి లీటర్లకు పైగా పాలను రైతులే నేరుగా పట్టణాలు, చుట్టుపక్కల గ్రామాలకు తీసుకెళ్లి వినియోగదారులకు అందిస్తున్నారు. మిగిలిన పాలను వివిధ డెయిరీ ఫామ్‌లకు సరఫరా చేస్తున్నారు. అంటే.. ఉత్పత్తి గ్రామంలోనే.. మార్కెట్ గ్రామం నుంచే.. ఆదాయం రైతులకే.

ఇక్కడ ఆడ, మగ అనే తేడా లేదు. వ్యవసాయం ఒకవైపు.. పాడి పరిశ్రమ మరోవైపు.. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ కుటుంబాలను ముందుకు తీసుకెళ్తున్నారు. అంతేకాదు.. ఉన్నత చదువులు చదివిన యువత కూడా పాడి పరిశ్రమను ఉపాధి మార్గంగా ఎంచుకోవడం మాణిక్యపురం ప్రత్యేకత. డిగ్రీలు, పీజీలు, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ చదివిన యువకులు సైతం పాలు ఉత్పత్తి చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు.

అయితే పాడి పరిశ్రమలో విజయానికి ప్రధాన సూత్రం క్రమశిక్షణ. పాడి రైతు తెల్లవారుజామున కోడి కూయకముందే నిద్రలేవాలి. ఉదయం నాలుగు గంటలకే పశువుల దగ్గరకు వెళ్లాలి. పాలు పితకాలి. పశువులకు మేత వేయాలి. వాటి ఆరోగ్యాన్ని చూసుకోవాలి. సమయానికి పాలు వినియోగదారుడి ఇంటికి చేరాలి. అందుకే పాడి రైతు జీవితంలో సెలవు అనే మాటకు చోటు ఉండదు.

ఒక లీటర్ పాలు రైతు చేతుల నుంచి బయటకు వచ్చిన తర్వాత దాని ప్రయాణం అక్కడితో ముగియదు. పాల సేకరణ కేంద్రం నుంచి డెయిరీకి.. అక్కడి నుంచి పెరుగు, వెన్న, నెయ్యి, పన్నీర్, చీజ్ వంటి ఉత్పత్తుల తయారీకి.. అక్కడి నుంచి మార్కెట్‌కు చేరుతుంది. స్వీట్స్ దుకాణాలు, హోటళ్లు, టీ, కాఫీ వ్యాపారాలు కూడా ఈ పాలపైనే ఆధారపడతాయి.

ప్రస్తుతం దేశంలో పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. పాడి పరిశ్రమకు మరింత ప్రోత్సాహం లభిస్తే తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి గ్రామాలు మరిన్ని ఆవిర్భవించే అవకాశం ఉంది. విజయ డెయిరీ వంటి సంస్థలు కూడా పాడి రైతుల నుంచి సేకరించిన పాలతో అనేక రకాల ఆహార ఉత్పత్తులను అందిస్తున్నాయి.

మాణిక్యపురం కథలో మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒక్క రైతు విజయం సాధించడం కాదు.. ఊరంతా కలిసి ముందుకు సాగుతోంది. ఒక కుటుంబం పాడి పరిశ్రమలో అడుగు పెడితే.. మరో కుటుంబం దానికి స్ఫూర్తి పొందుతోంది. అలా ఊరంతా ఒకే మాట.. ఒకే బాటగా పాల ఉత్పత్తిని తమ జీవనోపాధిగా మార్చుకున్నారు. మన చేతిలోని పాల గ్లాసు వెనుక ఓ పాడి రైతు కష్టం ఉంది. మన ఉదయపు చాయ్ వెనుక అతడి తెల్లవారుజామునే మొదలయ్యే శ్రమ ఉంది. మన ఆరోగ్యం కోసం పాలు అందించే ఈ రైతు.. తన కుటుంబం కోసం, తన గ్రామం కోసం, తన ఉపాధి కోసం ప్రతిరోజూ పోరాడుతున్నాడు.

దేశానికి అన్నం పెట్టే అన్నదాత ఎంత ముఖ్యమో.. ప్రతి ఉదయాన్ని పాలతో నింపే పాడి రైతు కూడా అంతే ముఖ్యుడు. సరిహద్దులో సైనికుడు దేశ భద్రత కోసం ఎలా నిత్యం విధుల్లో ఉంటాడో.. పాడి రైతు కూడా ప్రజలకు పాలు అందించేందుకు అంతే నిబద్ధతతో పనిచేస్తున్నాడు.

మట్టిలో పుట్టిన ఈ మాణిక్యాలు.. ఇప్పుడు పాలతో తమ భవిష్యత్తును రాసుకుంటున్నారు. మాణిక్యపురం చూపిస్తున్న దారి.. పాడి పరిశ్రమతో స్వయం ఉపాధి సాధించాలనుకునే ప్రతి గ్రామానికి ఓ స్ఫూర్తి కథ.

Follow Us