రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 13: ఎవరికీ అనుమానం రాకుండా.. లేడీ గేటప్ వేసాడు ఓ యువకుడు.. అంతే కాదు.. ఆయన అద్దెకు ఇచ్చిన షాప్ లో దొంగతనానికి పాల్పడ్డాడు.. ఎవరికీ అనుమానం రాకుండా.. ఈ ఇంటి దొంగ ఇలా ప్లాన్ చేసాడు.. చివరకు.. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతే షాకయ్యే అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు ఎవరికీ అనుమానం రాకుండా యువతి వేషధారణ ధరించి తన భవనంలోని దుకాణంలోనే దొంగతనానికి పాల్పడ్డాడు. భార్యకు సంబంధించిన సవరం, అమె డ్రెస్ ధరించి గుట్టు చప్పుడు కాకుండా దొంగతనం చేశాడు. చోరీకి పాల్పడిన దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో పోలీసులు 48 గంటల్లోనే కేసును ఛేదించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణంలో యువతి వేషధారణతో చోరీ చేసిన మండల కేంద్రానికి చెందిన యువకుడు రామిండ్ల సుధీర్ ను రిమాండ్ కి తరలించామని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. గ్రామంలోని రామిండ్ల నాంపల్లికి చెందిన భవనంలో మండలంలోని సింగారం గ్రామంలోని గనగోని బంటి లక్ష్మీనారాయణ ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ నెల 9న రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. 11న ఉదయం దుకాణానికి వచ్చి చూడగా వెనుక ఉన్న తలుపు తీసి కనిపించింది. కౌంటరులోని రూ.3500 నగదు అపహరణకు గురైందని గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సమాచారం అందుకున్న ఎస్ఐ రమాకాంత్ ఆధ్వర్యంలోని పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం పలు వివరాలు సేకరించి సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. అయితే, ముందు దొంగతనానికి పాల్పడినది యువతిగా భావించారు. అనుమానం వచ్చిన పోలీసులు సుధీర్‌ను అదుపులోకి తీసుకుని తమదైన విచారించారు. తానే తన భార్యకు సంబంధించిన సవరంతో పాటు దుస్తులు ధరించి దొంగతనానికి పాల్పడ్డానని అంగీకరించాడు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని ఎస్ఐ రమాకాంత్ వివరించారు.
యువతి వేషధారణలో యువకుడు దొంగతనం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్నీ తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..