AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సుపైనే కన్నేశాడు! పట్టపగలు దర్జాగా బస్సుతో పరారైన దొంగ బాబు..

బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఓ గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో కలకలం రేపింది. బస్టాండ్‌లో నిలిపిన బస్సును చోరీ చేసి నిజామాబాద్‌ వైపు తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది దాదాపు 18 కిలోమీటర్ల పాటు వెంబడించారు. ఈ క్రమంలో దుండగుడు మూడు ద్విచక్ర వాహనాలు, పోలీసుల వాహనాన్ని ఢీకొట్టాడు. చివరకు..

వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సుపైనే కన్నేశాడు! పట్టపగలు దర్జాగా బస్సుతో పరారైన దొంగ బాబు..
Korutla TGSRTC Bus Theft case
Srilakshmi C
|

Updated on: Jul 22, 2026 | 8:24 AM

Share

నిత్యం ఎక్కడో ఒకచోట చోరీలు జరగడం షరా మామూలే. సాధారణంగా దొంగలు డబ్బు, బంగారం, బైకులు, వాహనాలను చోరీ చేయడం చూస్తుంటాం. అయితే జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో జరిగిన ఓ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు. అది కూడా నిత్యం ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సుపైనే కన్నేయడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ ఘటన కోరుట్ల బస్టాండ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు దాదాపు 18 కిలోమీటర్ల పాటు వెంబడించి చివరకు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోకు చెందిన TS08Z0103 నంబర్‌ ఆర్టీసీ బస్సును డ్రైవర్‌ ప్రవీణ్‌ కోరుట్ల బస్టాండ్‌లోని 8వ నంబర్‌ ప్లాట్‌ఫాంపై నిలిపి కండక్టర్‌తో కలిసి కొద్దిసేపు పక్కకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఓ ఆగంతుకుడు బస్సులోకి ఎక్కి దానిని స్టార్ట్‌ చేసి నిజామాబాద్‌ వైపు తీసుకెళ్లాడు.

బస్సు కనిపించకపోవడంతో అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మెట్‌పల్లి సర్కిల్‌కు చెందిన పోలీసులు, ఆర్టీసీ ఉద్యోగులు వాహనాల్లో బస్సును వెంబడించారు. అయితే దుండగుడు వేగంగా బస్సును నడుపుతూ కోరుట్ల, ఆరపేట, వెంకట్రావుపేట ప్రాంతాల్లో మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనల్లో వాహనదారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అంతేకాకుండా బస్సును వెంబడిస్తున్న పోలీసుల వాహనాన్ని కూడా ఢీకొట్టడంతో ఆ వాహనం దెబ్బతింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించి, మెట్‌పల్లి మండల పరిధిలోని గండి హనుమాన్‌ దేవాలయం సమీపంలో జాతీయ రహదారిపై భారీ వాహనాలను అడ్డంగా నిలిపారు.

ముందుకు వెళ్లే మార్గం లేకపోవడంతో దుండగుడు బస్సును రోడ్డుపక్కనున్న చెట్టుకు ఢీకొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా, వెంటనే పోలీసులు అతడిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సునే దొంగిలించడం, దానితో బీభత్సం సృష్టించడం చర్చనీయాంశంగా మారింది. నిందితుడు ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డాడు? అతని మానసిక పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Follow Us