Telangana: డబ్బు పంపకంలో తేడా.. పిల్లనిచ్చిన మామనే కడతేర్చిన అల్లుడు..

| Edited By: శివలీల గోపి తుల్వా

Jul 17, 2023 | 11:45 AM

Nalgonda News: ఆర్థిక సంబంధాలు.. మానవ సంబంధాలను ఛిద్రం చేస్తున్నాయి.. మగ పిల్లల వారసత్వం లేనివారు ఇంటి అల్లుళ్లనే కొడుకులుగా భావిస్తుంటారు. ఆ అల్లుడే.. డబ్బు పంపకంలో తేడా రావడంతో తనకు పిల్లను ఇచ్చిన మామనే దారుణంగా..

Telangana: డబ్బు పంపకంలో తేడా.. పిల్లనిచ్చిన మామనే కడతేర్చిన అల్లుడు..
Chinna Marayya(Inset); Accused Narayana(Inset)
Follow us on

Nalgonda News: ఆర్థిక సంబంధాలు.. మానవ సంబంధాలను ఛిద్రం చేస్తున్నాయి.. మగ పిల్లల వారసత్వం లేనివారు ఇంటి అల్లుళ్లనే కొడుకులుగా భావిస్తుంటారు. ఆ అల్లుడే.. డబ్బు పంపకంలో తేడా రావడంతో తనకు పిల్లను ఇచ్చిన మామనే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది.. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా పెద్ద అడిచర్లపల్లి మండలం పోల్కంపల్లికి చెందిన చినమారయ్య, మంగమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె వెంకటమ్మను పీఏ పల్లి మండలం గణపురం, చిన్న కుమార్తె లక్ష్మమ్మలను గుర్రంపోడు మండలం తెరాటి గూడెంకు ఇచ్చి పెళ్లి చేశారు. తనకున్న భూమిలో చిన్న మారయ్య మూడున్నర ఎకరాల చొప్పున ఇద్దరు కుమార్తెలకు పంచి ఇచ్చాడు.

ఇంకా తన వద్ద మిగిలి ఉన్న 1.13 గుంటల భూమిని ఇటీవల విక్రయించగా మారయ్యకు 35 లక్షల రూపాయలు వచ్చాయి. ఇందులో ఆర్థికంగా చితికిపోయిన పెద్ద కూతురు వెంకటమ్మకు 10 లక్షల రూపాయలు, చిన్న కూతురు లక్ష్మమ్మకు 8 లక్షల రూపాయలు ఇచ్చాడు. డబ్బు పంపకంలో పెద్దల్లుడికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడంటూ.. చిన్నల్లుడు నారాయణ ఆగ్రహంతో ఊగిపోయాడు. పోల్కంపల్లికి నారాయణ వచ్చి అత్తతో గొడవపడ్డాడు. మేకలను మేపడానికి వెళ్ళిన పొలం వద్దకు వెళ్లి మామ మారయ్యతో తనకు ఎందుకు తక్కువ డబ్బులు ఇచ్చారంటూ ప్రశ్నించాడు.

దీంతో ఇద్దరు మధ్య వాగ్వివాదం, ఘర్షణ చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన నారాయణ పక్కనే ఉన్న బండరాయితో మామ చిన్న మారయ్య తలపై మోది చంపాడు. మారయ్య సాయంత్రం ఇంటికి రాకపోయేసరికి ఆందోళన చెందిన మృతుడు భార్య మంగమ్మ వెతకగా పొలంలో విగతాజీవిగా పడి ఉన్నాడు. మృతుడు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, డబ్బు పంపకంలో తేడా రావడంమే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..