Telangana: పండగ పూట పెను విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

|

Jan 15, 2025 | 4:44 PM

సంక్రాంతి సరదా ఆ ఇంట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ వ్యక్తి సరదాగా భవనంపై నుంచి గాలిపటం ఎగురవేస్తూ ఆనందంలో మునిగిపోయాడు. కానీ కాసేపటికే ఆ ఆనందం ఆవిరైంది. గాలిపటం ఎగరవేయడంలో మునిగిపోయిన సదరు వ్యక్తి పొరబాటున భవనం అంచు వరకు వెళ్లాడు. అంతే రెప్పపాటులో బిల్డింగ్ పై నుంచి జారీ కింద పడిపోయాడు..

Telangana: పండగ పూట పెను విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి
Kite Flying
Follow us on

యాదాద్రి భువనగిరి, జనవరి 15: సంక్రాంతి పండగ దక్షిణాది వారికి చాలా ప్రత్యేకం. పెద్దోళ్లకి కోళ్ల పందేలు, పిల్లలకు పతంగులు.. రకరకాల స్వీట్లు, ముగ్గులు, అతిథుల ఆహ్వానాలు ఒక్కటేమిటి ఇంటిల్లిపాది ఎంతో సందడిగా ఈ పండగ జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండగ సరదా ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంటిపై మేడమీద గాలిపటం ఎగురవేస్తూ ఆదమరిచి ఉండగా.. అమాంతం బిల్డింగ్‌పై నుంచి కింద పడిపోయాడు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూర్ మండలం అమ్మనబోలులో మంగళవారం (జనవరి 14) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూర్ మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన జూపల్లి నరేందర్ అనే వ్యక్తి సంక్రాంతి పండగనాడు పిట్టగొడ లేని భవనంపై గాలిపటం ఎగురవేస్తున్నాడు. ఆదమరిచి గాలిపటం ఎగుర వేస్తున్న సురేందర్‌ పొరబాటున భవనం అంచువరకు వెళ్లాడు. పిట్టగోడ లేకపోవడంతో అతడు ఒక్కసారిగా బిల్డింగ్‌పై నుంచి కింద పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నరేందర్‌ మృతితో సంక్రాంతి పండగ పూట ఆ గ్రామంలో బంధువుల రోదనలు మిన్నంటాయి. గాలిపటాలు ఎగరవేసేటప్పుడు తగిన జాగ్రతత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరోవైపు పతంగులు ఎగురవేయడానికి వినియోగించే చైనా మాంజా వల్ల కూడా గతంలో పలు చోట్ల ప్రమాదాలు జరిగాయి. దీంతో ఈ ఏడాది చైనా మాంజా నిషేధించినప్పటికీ కొందరు వ్యాపారులు అక్రమంగా వీటిని విక్రయింస్తున్నారు. చైనా మాంజా కారణంగా సంగారెడ్డి జిల్లాలో బైక్‎పై వెళ్తున్న వెంకటేష్ అనే వ్యక్తి గొంతు కోసుకుపోవడంతో రోడ్డుపైనే ప్రాణాలు వదిలాడు. పలుచోట్ల పక్షులు కూడా చైనా మాంజాకు చిక్కుకుని విలవిలలాడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.