Telangana: నిండుప్రాణాన్ని బలిగొన్న సొరకాయ.. నా తప్పేం లేదంటున్న మహిళ.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..

సొరకాయ తీగ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన పెద్ద రగడ సృష్టిస్తోంది.

Telangana: నిండుప్రాణాన్ని బలిగొన్న సొరకాయ.. నా తప్పేం లేదంటున్న మహిళ.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..
Calabash Bottle Gourd

Updated on: Nov 09, 2022 | 7:01 AM

సొరకాయ తీగ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన పెద్ద రగడ సృష్టిస్తోంది. వివరాల్లోకెళితే.. సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో సొరకాయ తీగ కారణంగా ఒక ప్రాణం బలైపోయింది. గ్రామానికి చెందిన సూరయ్య తన ఇంటి ముందున్న కంచెను శుభ్రం చేస్తుండగా సొరకాయ తీగ తెగిపడింది. సూరయ్య ఇంటి పక్కనుండే మహిళ.. సొరకాయ తీగను ఎందుకు తెంపావంటూ ప్రశ్నించింది. దాంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. సదరు మహిళ ఆవేశంలో సూరయ్యను కర్రతో కొట్టడంతో.. వివాదం కాస్తా చినికిచినికి గాలివానలా మారింది.

పెద్దమనుషులు సర్దిచెప్పడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది. అయితే, తెల్లారేసరికి సూరయ్య విగతజీవిగా మారడంతో గ్రామంలో కలకలం రేగింది. సూరయ్య చనిపోవడానికి కృష్ణవేణి కొట్టిన దెబ్బలే కారణమంటూ ఆందోళనకు దిగారు బాధితుడి కుటుంబ సభ్యులు. కృష్ణవేణి ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నా చేశారు బంధువులు. సూరయ్యను కొట్టిన కృష్ణవేణిపై సత్తుపల్లి పీఎస్‌లో కంప్లైంట్‌ చేశారు బంధువులు.

అయితే, తాను చిన్న కట్టెపుల్లతో కాళ్లపై మాత్రమే కొట్టానని అంటోంది కృష్ణవేణి. చాలా చిన్న దెబ్బ కొట్టానని, దానికి పెద్దమనుషులు వెయ్యి రూపాయలు జరిమానా కూడా విధించారని చెబుతోంది. అతను అనారోగ్యంతో చనిపోతే, తన వల్లే మరణించాడని చెప్పడం దారుణమంటోంది కృష్ణవేణి. ఏది ఏమైనప్పటికీ.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూరయ్య మృతి మిస్టరీ తేల్చేందుకు బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..