Hyderabad: మల్లారెడ్డి యూనివర్సిటీలో విషాదం.. పరీక్ష రాస్తూ తరగతి గదిలోనే గుండెపోటుతో విద్యార్ధి మృతి!
మల్లారెడ్డి యూనివర్సిటీలో విషాదం చోటు చేసుకుంది. ఓ విద్యార్ధి క్లాస్ రూంలో పరీక్ష రాస్తూ ఉన్నట్లుండి గుండె పోటుతో స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం కాసేపటికే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన గురువారం (ఆగస్టు 8) చోటు చేసుకుంది. దీంతో క్యాంపస్‌లో తీవ్ర కలకలం రేగింది. పేట్ బషీరాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విజయవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్, ఆగస్టు 9: మల్లారెడ్డి యూనివర్సిటీలో విషాదం చోటు చేసుకుంది. ఓ విద్యార్ధి క్లాస్ రూంలో పరీక్ష రాస్తూ ఉన్నట్లుండి గుండె పోటుతో స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం కాసేపటికే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన గురువారం (ఆగస్టు 8) చోటు చేసుకుంది. దీంతో క్యాంపస్‌లో తీవ్ర కలకలం రేగింది. పేట్ బషీరాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విజయవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన అరుణ్ కుమార్ (19) అనే విద్యార్థి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పరీక్ష రాస్తుండగా అరుణ్ కుమార్ హఠాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం తోటి విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది కార్డియోపల్మోనరీ రిససిటేషన్ నిర్వహించి, సూరారంలోని మల్లా రెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతన్ని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.
అయితే సకాలంలో అంబులెన్స్ రాకపోవడం వల్ల వైద్యం అందించడంలో ఆలస్యం అయిందని, లేకుంటే అరుణ్ బతికేవాడని మృతుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు యూనివర్సిటీ ఎదుట ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీ అధికారులు 25 నిమిషాల్లోనే అరుణ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారని చెబుతున్నారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
అసలు అరున్ ఎందుకు ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడు? నిజంగానే కార్డియాక్ అరెస్ట్ వల్లనే మృతి చెందాడా? మరేదైనా కారణం వల్ల మరణం సంభవించిందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా ఇటీవల కాలంలో సైలెంట్ హార్ట్ అటాక్ కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా సైలెంట్‌గా గుండె ఆగిపోవడాన్ని ‘కోవర్ట్ కిల్లర్’ లాంటిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సైలెంట్ హార్ట్ ఎటాక్ సంభవించినప్పుడు ఛాతిలో తీవ్రమైన నొప్పి, ఒత్తిడిగా అనిపించడం, మెడ, చేతి, అరచేతి నొప్పి రావడం, మగతగా ఉండడం, చెమటలు పట్టడం లాంటి లక్షణాలు ఏవీ కనిపించవట. అందుకే తమకు కలిగే ఆకస్మిక అసౌకర్యం గుండెపోటో కాదో తెలియక ప్రమాదంలో పడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. దీంతో చికిత్స మరింత ఆలస్యమై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అంటున్నారు.