AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nalgonda Politics: అభ్యర్థిని మార్చాలని అధిష్టానంపై ఒత్తిడి.. ఎన్నికల బరి నుంచి సైదిరెడ్డి డ్రాప్ అవుతారా..?

ఎంపీ అభ్యర్థి విషయంలో నల్లగొండ బీజేపీలో ముసలం మొదలైందా..? ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డిని మార్చాలని పార్టీ అధిష్టానంపై నేతలు ఒత్తిడి చేస్తున్నారా..? అభ్యర్థిని మార్చకపోతే పార్టీ శ్రేణులు సహాయ నిరాకరణ చేస్తామంటున్నాయా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఏకంగా ఎన్నికల బరి నుంచి సైదిరెడ్డి డ్రాప్ అవుతారన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Nalgonda Politics: అభ్యర్థిని మార్చాలని అధిష్టానంపై ఒత్తిడి.. ఎన్నికల బరి నుంచి సైదిరెడ్డి డ్రాప్ అవుతారా..?
Nalgonda Mp Candidate Saidireddy
M Revan Reddy
| Edited By: |

Updated on: Mar 27, 2024 | 12:07 PM

Share

ఎంపీ అభ్యర్థి విషయంలో నల్లగొండ బీజేపీలో ముసలం మొదలైందా..? ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డిని మార్చాలని పార్టీ అధిష్టానంపై నేతలు ఒత్తిడి చేస్తున్నారా..? అభ్యర్థిని మార్చకపోతే పార్టీ శ్రేణులు సహాయ నిరాకరణ చేస్తామంటున్నాయా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఏకంగా ఎన్నికల బరి నుంచి సైదిరెడ్డి డ్రాప్ అవుతారన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు రేపటి పార్లమెంటు స్థాయి సమావేశానికి నేతలు డుమ్మా కొట్టాలని ఫ్లాన్ చేస్తున్నారట. మరోవైపు పార్టీ బలోపేతానికి సైదిరెడ్డి అవసరమేనని క్యాడర్ ను అగ్ర నేతలు బుజ్జగిస్తున్నారు. అసలు నల్లగొండ పార్లమెంటు బీజేపీలో ఏం జరుగుతోంది..?

లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సర్కార్ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. తెలంగాణలో అత్యధిక స్థానాలపై కన్నేసిన కషాయ దళం.. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ఈ క్రమలోనే ఇతర పార్టీల నేతలను సైతం కమలం గూటి చేర్చుకుని టికెట్లను ఇచ్చింది. గెలుపే లక్ష్యంగా బీజేపీ నల్లగొండ లోక్‌సభ టికెట్ ను పార్టీ నేతలను కాదని, పది రోజుల క్రితం కాషాయ కండువా కప్పుకున్న బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి ప్రకటించింది.

నల్లగొండ బీజేపీలో ముసలం..

ఇపుడు నల్లగొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డిపై బీజేపీ పాత క్యాడర్‌, నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. దీంతో బీజేపీ నల్లగొండ ఎంపీ సీటు విషయంలో ఆ పార్టీలో ముసలం మొదలైందట. సైదిరెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన బీజేపీ ముఖ్య నేతలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు.. తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డిని హైదరాబాద్ లో కలిశారట. ఎంపీ అభ్యర్థిగా సైదిరెడ్డిని మార్చాలని విజ్ఞప్తి చేశారట. బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, రాళ్ల దాడులు చేయించిన వారికి ఎలా ఇస్తారని కూడా ప్రశ్నిస్తున్నారట.

గుర్రంబోడు గిరినజనుల భూముల వివాదం..

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడులో గిరిజనుల భూములను బీఆర్ఎస్ నేతలు ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ భూములను రక్షించేందుకు ‘గిరిజన భరోసా యాత్ర’ పేరుతో బీజేపీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 2021 ఫిబ్రవరిలో గుర్రంబొడులో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్రమ కేసులతో కొందరు బిజెపి నేతలు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఆ వివాదానికి కారణమని భావిస్తున్న సైదిరెడ్డికి ఎంపి టికెట్ ఇవ్వడాన్ని నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్ లోని కొందరు బీజేపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారట.

సైదిరెడ్డికి బీజేపీ శ్రేణులు సహాయ నిరాకరణ..!

ఈ నేపథ్యంలో నల్లగొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని మార్చాలని పార్టీ నాయకులు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారట. అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తరువాత వెనక్కి తగ్గేది ఉండదని అగ్రనేతలు సైదిరెడ్డి వ్యతిరేక వర్గానికి స్పష్టం చేశారట. అయితే పార్టీ ప్రకటించిన అభ్యర్థి తనకు తాను డ్రాప్ అయితే పార్టీ మరో ఆలోచన చేసే అవకాశం ఉంటుందని చెప్పారట. దీంతో సైదిరెడ్డిని మార్చకపోతే ఎన్నికల్లో సహాయ నిరాకరణకు దిగాలని ఆయనను వ్యతిరేకిస్తున్న కీలక నేతలు నిర్ణయించారట. రేపు నల్లగొండలో జరిగే బీజేపీ పార్లమెంటు స్థాయి సమావేశానికి డుమ్మా కొట్టాలని కూడా చూస్తున్నారట.

ఎన్నికల బరి నుంచి సైదిరెడ్డి డ్రాప్ అవుతారా..?

సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి సెగలతో నిజంగా సైదిరెడ్డి ఎన్నికల బరి నుంచి డ్రాప్ అవుతారా..? అనే అంశం చర్చకు దారితీసింది. టికెట్ ప్రకటించిన మొదట్లో పెద్దగా పట్టించుకోని ఆ పార్టీ శ్రేణులు పది రోజుల తర్వాత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని సైదిరెడ్డి అనుచరులు మండి పడుతున్నారు. అయితే సైదిరెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల బరి నుంచి వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారట.

బీజేపీలోకి మాజీ ఎమ్మెల్సీ తేరా..?

ఇదిలావుంటే బీఆర్‌ఎ్‌సకు ఇటీవలే రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి.. బీజేపీలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే నల్లగొండ ఎంపీ టికెట్ ఇస్తేనే తాను పార్టీలో చేరుతానని చిన్నపరెడ్డి చెబుతున్నారట. చిన్నపరెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు ముఖ్య నేతలు రాయబారం నడుపుతున్నారట. ఒకవేళ టికెట్ రాకున్నా చిన్నపరెడ్డి పార్టీలో చేరుతారో లేదో అన్నది రేపో మాపో తేలనుంది. మొత్తంగా నల్లగొండ ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో తలెత్తిన వివాదాన్ని బీజేపీ అధిష్ఠానం త్వరగా పరిష్కరించాలని బిజెపి శ్రేణులు కోరుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…