Political Defence: గురు శిష్యుల మధ్య వ్యక్తిగత దూషణలకు దారితీస్తున్న రాజకీయ విమర్శలు..!

|

Apr 13, 2024 | 4:47 PM

ఆయన ఒకప్పుడు రాజకీయాల్లో డిక్టేటర్.. కానీ ఇప్పుడు నిత్యం డిఫెన్స్‌లో పడుతున్నారు. ప్రత్యర్థుల రాజకీయ విమర్శలకు తప్పనిసరి పరిస్థితుల్లో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ విమర్శలు వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళడంతో ప్రతీ విమర్శకు ఆయనే స్వయంగా సమాధానం చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఎవరా సీనియర్ నాయకుడు..? ఎందుకు ఎలాంటి పరిస్థితి ఏర్పడింది..?

Political Defence: గురు శిష్యుల మధ్య వ్యక్తిగత దూషణలకు దారితీస్తున్న రాజకీయ విమర్శలు..!
Aroori Ramesh ,kadiyam Srihari
Follow us on

ఆయన ఒకప్పుడు రాజకీయాల్లో డిక్టేటర్.. కానీ ఇప్పుడు నిత్యం డిఫెన్స్‌లో పడుతున్నారు. ప్రత్యర్థుల రాజకీయ విమర్శలకు తప్పనిసరి పరిస్థితుల్లో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ విమర్శలు వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళడంతో ప్రతీ విమర్శకు ఆయనే స్వయంగా సమాధానం చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఎవరా సీనియర్ నాయకుడు..? ఎందుకు ఎలాంటి పరిస్థితి ఏర్పడింది..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

ఓరుగల్లులో రాజకీయం వేడెక్కింది. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ, నేతల మధ్య విమర్శలు తారస్థాయికి చేరాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. గురు శిష్యుల మధ్య రాజకీయ విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శల వైపు దారి మల్లుతున్నాయి. నేతలు పరస్పరం వ్యక్తిగత విమర్శలతో జనంలో చర్చలు మొదలయ్యాయి. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తన జీవితం తెల్ల కాగితం అని నిత్యం మీడియా ముందు చెప్పే సీనియర్ పొలిటిషియన్, మాజీ మంత్రి కడియం శ్రీహరి లాంటి సీనియర్ నాయకుడు ఇప్పుడు నిత్యం జనంలో ప్రశ్నగా మారుతున్నారు. ఆయనపై వస్తున్న విమర్శలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనే స్పందించి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ మధ్య కడియం శ్రీహరి చిరకాల ప్రత్యర్థి డాక్టర్ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ నేత కడియం శ్రీహరి అసలు SC కాదని వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మీడియా ముందుకు వచ్చిన కడియం శ్రీహరి తాను దళితుడిని అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఆయన తన కులాన్ని ఋజువు చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. విపక్షాల విమర్శలకు తనదైన శైలిలో సమాధానం చెప్పి నోర్లు మూయించారు. ఇక, తాజాగా తన కూతురు రాజకీయ జీవితం కోసం పార్టీ మారిన కడియం శ్రీహరి కాంగ్రెస్ గూటికి చేరాడు. ఒకప్పుడు కాంగ్రెస్ పైన దుమ్మెత్తి పోసిన కడియం శ్రీహరి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ ఒక వర్గం ఆయనను వ్యతిరేకిస్తుంటే, మరో వర్గం మాత్రం కాంగ్రెస్‌కు బలం వచ్చిన ఫీలింగ్‌తో ఉన్నారు.

ఇదిలావుంటే, ప్రత్యర్థులు మాత్రం కడియం శ్రీహరి పై విమర్శలు ఎక్కు పెడుతున్నారు. మొన్నటి వరకు ఆయన శిష్యుడిగా పేరున్న ఆరూరి రమేష్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీజేపీ – కాంగ్రెస్ మధ్య మాటల దుమారం రేగుతుంది. కడియం శ్రీహరిపై ఆరూరి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం కడుపులో కత్తులు పెట్టుకుని కపట ప్రేమ నటించే వ్యక్తి కడియం శ్రీహరి అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఆయన రాజకీయ ఎదుగుదల కోసం ఎంతోమంది దళిత నేతలను అనగా తొక్కాడని ఆయనలాంటి స్వార్ధపరులను ఎక్కడ చూడలేదని మండిపడ్డారు.

కడియం శ్రీహరి బిడ్డ గుంటూరు కోడలు అని, గుంటూరు వాసిని చేసుకున్న ఆమె గుంటూరు బిడ్డవుతుంది కానీ ఓరుగల్లు బిడ్డ ఎలా అవుతుందని దుయ్యబట్టారు. అమె గుంటూరు కోడలు ఇక్కడి ప్రజలకు ఏం చేస్తుంది..? అని ఆరూరి ప్రశ్నించారు. ఇక్కడ ప్రజలు ఎలా ఆదరిస్తారు..? ఆమెకు ఇలా ఓటు వేస్తారని ఆరూరి రమేష్ నిలదీశారు. తనను క్లాస్ వన్ కాంట్రాక్టర్ ను చేశానని కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై కూడా అరూరి రమేష్ ఘాటుగా స్పందించారు. 1991 లోనే కాంట్రాక్టర్‌ని అని స్వయం శక్తితో ఎదిగిన వాన్ని అన్నారు. కడియం శ్రీహరికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు ఆరూరి రమేష్.

మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా కడియం శ్రీహరిని తూర్పాల పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరికి ఇచ్చినని అవకాశాలు కేసీఆర్ ఎవరికి ఇవ్వలేదని, ఆయనకు పార్టీలో మంచి గౌరవం కల్పించి ఉన్నత స్థాయిలో కూర్చోబెడితే వంకర బుద్ధి చూపించాడని మండిపడ్డారు గులాబీ నేతలు. ఆయనకు ఇల్లు ఎవరు కట్టించారో.. ఎన్ని అక్రమ ఆస్తులు ఉన్నాయో ఆ చిట్టా మొత్తం బయటపెడతామని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు.

దీంతో 40 ఏళ్ల నా రాజకీయ జీవితం తెల్ల కాగితం అని నిత్యం మీడియా ముందు చెప్పే కడియం శ్రీహరి ఇప్పుడు ప్రత్యర్ధుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయనే మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పడంతో పాటు తన రాజకీయ అనుభవాన్ని ప్రదర్శిస్తున్నారు. తనపై విమర్శలు చేస్తున్న నాయకులను కడిగి పారేస్తున్నారు.

ఏది ఏమైనా నాలుగు దశాబ్దాల చరిత్రలో తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేక గుర్తింపు పొందిన నేతపై ఇలాంటి వ్యక్తిగత విమర్శలు జనంలో చర్చగా మారుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…