Tahsildar Office: తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన వ్యక్తి.. ఆరుబయటే కూర్చుని విధులు నిర్వహించిన సిబ్బంది
తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.. అయితే అదే రెవెన్యూ కార్యాలయం సమస్యల్లో పడితే.. ఆ ఆఫీస్‌కే తాళం వేస్తే పరిస్థితి ఏంటి?
Sirgapur Tahsildar Office Locked: తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.. అయితే అదే రెవెన్యూ కార్యాలయం సమస్యల్లో పడితే.. ఆ ఆఫీస్‌కే తాళం వేస్తే పరిస్థితి ఏంటి? రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని ఆనుకుని ఉన్న సంగారెడ్డి జిల్లాలో అలాంటి సమస్యే ఏర్పడింది.సిర్గాపూర్ తహసిల్దార్ కార్యాలయం.. ఇక్కడికి నిత్యం వందలాది మంది తమ తమ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం వస్తుంటారు. తాజాగా రోజు మాదిరిగా అక్కడికి వచ్చిన జనానికి ఆఫీస్‌కి తాళం వేలాడుతూ కనిపించడం ఆశ్చర్యానికి గురి చేసింది. తహసీల్దార్ భవనం అద్దె బకాయి ఉండటం తో భవన యజమాని కార్యాలయానికి తాళం వేశారు. తనకు రావలసిన 1 లక్షా 37 వేల 800 రూపాయల అద్దె బకాయి మొత్తం చెల్లించే వరకు ఆఫీస్‌కి వేసిన తాళాలు తీసేది లేదని పట్టుబట్టారు భవన యజమాని. నిన్న సిర్గాపూర్ తహసిల్దార్ కార్యాలయానికి తాళం వేయడంతో ఆఫీస్ సిబ్బంది, ప్రజలు కార్యాలయం బయటే కూర్చోవాల్సి వచ్చింది.
కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా సిర్గాపూర్‌లో 2016 అక్టోబరులో ప్రైవేటు భవనంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ఏశబోయిన నర్సింహులు, సాయిలుకు చెందిన ఇంటికి అద్దెకు తీసుకుని అప్పుడప్పుడు కిరాయి చెల్లించేవారు. రెండేళ్లుగా రూ.లక్షా50వేల అద్దె చెల్లించకపోవడంతో తాళం వేసినట్లు ఇంటి యజమాని తల్లి నర్సమ్మ తెలిపారు. తహసీల్దార్ రత్నం అద్దె బకాయి విషయమై కలెక్టర్, ఆర్డీవోలతో మాట్లాడానని, బిల్లు రాగానే ఇస్తానని చెప్పినా తాళం ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది.
ఆ తర్వాత వచ్చిన తహశీల్దార్ రత్నం.. భవన యజమాని నర్సింహులుతో మాట్లాడారు. అయితే, అద్దె విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదని అందుకే తాళం వేశానని భవన యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ ఆర్డీఓ రాజేశ్వర్‌తో ఫోన్‌లో మాట్లాడిన యజమాని 15 రోజుల్లో అద్దె మొత్తం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో కార్యాలయం తాళాలు తెరిచారు యజమాని. అప్పటి వరకు భూ రిజిస్ట్రేషన్‌లు ఇతర పనుల కోసం వచ్చిన వారు అంతా కార్యాలయం బయటే కూర్చోవాల్సి వచ్చింది. లక్షా ముప్పై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు చెల్లించాల్సి ఉందని, ఆగస్ట్ 18వ తేదీ నాడే కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చానని, అయినా ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడంతో తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేయాల్సి వచ్చిందని భవన యజమాని తెలిపారు.