
ఒకప్పుడు రాజ్యాధికారం, ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధాల్లో రాజ్యాలే కూలిపోయాయి. ఇప్పుడు ఆధిపత్య రాజకీయలతో గ్రామాలే అట్టుడికి పోతున్నాయి. ఈ రాజకీయ సెగ సామాన్యులకే కాదు.. ఆ గ్రామ ఇలవేల్పైన దేవుడికి కూడా తప్పడం లేదు. రాజకీయ వైరుధ్యాలతో గ్రామంలోని ఆలయానికి తాళం వేశారు. ఆ దేవుడికి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాల నిర్వహణ సందిగ్ధంలో పడింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారంలో గ్రామస్తులు ఆలయ నిర్మాణ కమిటీ ఏర్పాటు చేసుకుని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించారు. 2018లో ఆలయ చైర్మన్గా కాంగ్రెస్కు చెందిన కదిరె వెంకటరెడ్డిని ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఆలయ నిధుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. గ్రామంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆలయ నిధుల్లో అక్రమాలకు పాల్పడ్డాడంటూ ఆలయ నిర్మాణ కమిటీకి చెందిన రెక్కల శంభిరెడ్డి, రామ్మోహనరెడ్డిలు.. కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, ఎంపీటీసీ గోపీరెడ్డిలపై హైకోర్టుకు వెళ్లారు. విచారణ జరిపిన కోర్టు వెంకటరెడ్డి, గోపీరెడ్డిలు ఆలయ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. దీంతో గత నెలలో ఆలయ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రస్తుత ధర్మకర్తల మండలికి ఛైర్మన్గా బీఆర్ఎస్కు చెందిన సాముల బ్రహ్మారెడ్డి, ధర్మకర్తల సభ్యులుగా రెక్కల శంభిరెడ్డి, పల్లె నాగిరెడ్డి, పెద్ద కోటిరెడ్డి, అంజిరెడ్డి, రామ్మోహనరెడ్డి, కోటిరెడ్డిలు ఉన్నారు. దీంతో గ్రామస్తులు, ధర్మకర్తల మండలి సభ్యులు కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాలుగా విడిపోయారు. దీంతో ఆలయ కమిటీ నిర్వహణ లెక్కల విషయంలో పెద్ద గొడవే జరుగుతోంది. రాజకీయ వైరంతో మాజీ చైర్మన్ వెంకటరెడ్డి ఆలయ నిర్వహణ ఖర్చులు వెల్లడించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నడుస్తోంది.
మరోవైపు గ్రామ ఇలవేల్పుగా భావిస్తున్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 4 నుంచి నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఛైర్మన్ బ్రహ్మారెడ్డి, ధర్మకర్తల మండలి వార్షిక బ్రహ్మోత్సవాలకు సన్నద్ధమవుతున్నారు. గ్రామంలో ఆదిపత్యం కోసం కాంగ్రెస్కు చెందిన మాజీ చైర్మన్ వెంకటరెడ్డి 30 మందితో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. వార్షిక బ్రహ్మోత్సవాలను తామే నిర్వహిస్తామంటూ వెంకటరెడ్డి వర్గం ఆలయ ప్రధాన ద్వారానికి తాళం వేశారు. దీంతో రెండువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆలయ కమిటీ ఛైర్మన్ బ్రహ్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇలా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు రాజకీయ రంగు పులుముకుంది. వేంకటేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించి ఇరువర్గాలను పిలిపించి మాట్లాడుతామని హుజూర్ నగర్ సిఐ చరమందరాజు చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..