Telangana: 48 గంటల డెడ్‌లైన్.! బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్ ఇది

మరోసారి బండి సంజయ్‌, కేటీఆర్‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో విచారణకు హాజరైన తర్వాత బండి సంజయ్‌ చేసిన కామెంట్స్‌పై కేటీఆర్‌ సీరియస్‌ అయ్యారు. అదే స్థాయిలో ట్విట్టర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు బండి సంజయ్‌. ఇంతకీ కేంద్రమంత్రి ఏం అన్నారు? KTR ఇచ్చిన రియాక్షన్‌ ఏంటి..?

Telangana: 48 గంటల డెడ్‌లైన్.! బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్ ఇది
Ktr & Bandi Sanjay

Updated on: Aug 09, 2025 | 7:30 AM

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్‌ స్టేట్‌మెంట్‌ను సిట్‌ అధికారులు రికార్డు చేశారు. ఆనంతరం బండి సంజయ్‌ చేసిన కామెంట్స్‌తో రాజకీయం వేడెక్కింది. కేంద్రమంత్రి బండి సంజయ్‌ కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్‌. ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆరోపణలు నిరూపించాలని సవాల్‌ చేశారు. లేకపోతే 48 గంటల్లో బండి సంజయ్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే లీగల్‌ నోటీసులిస్తానన్నారు కేటీఆర్‌. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న బండి సంజయ్‌కి.. ఇంటెలిజెన్స్‌ ఎలా పనిచేస్తుందో తెలియదా అని ప్రశ్నించారు.

కేటీఆర్‌ సవాల్‌పై స్పందించారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. కేటీఆర్‌ ఇల్లీగల్‌ పనులన్నీ చేసేసి.. లీగల్‌ నోటీసుల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తనకు గడువు ఇవ్వడం కాదు.. మీ చీకటి రహస్యాలు బయటపడితే.. దాక్కోవడానికి చోటు కూడా మిగలదన్నారు బండి సంజయ్‌. అంతకుముందు సిట్‌ విచారణకు హాజరైన బండి సంజయ్‌కి 5 పేజీల వివరాలు ఇచ్చారు సిట్‌ అధికారులు. ఆ వివరాలు చూసి కేంద్రమంత్రి బండి సంజయ్ షాకైయ్యారు. కేంద్ర పెద్దలతో మాట్లాడిన కాల్స్ సైతం ట్యాప్ అయినట్లు సిట్‌ అధికారులు స్పష్టం చేశారు.

వెంటనే కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్ర పెద్దలు సీరియస్ అయినట్లు తెలిసింది. జడ్జీలు, టెలికం సంస్థలను సిట్ విచారించలేనందున.. సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌తో పాటు నాటి బీఆర్ఎస్ మంత్రులు, నేతలను కూడా విచారణకు పిలవాలన్నారు. కేసీఆర్‌ ఫ్యామిలీ టార్గెట్‌గా బండి సంజయ్ చేసిన కామెంట్స్‌పై కేటీఆర్‌ సీరియస్‌ కాగా.. CBIకి అప్పగించాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి.

ఇది చదవండి: ఆరుగురు వ్యక్తులు, మూడు కార్లు.. ORRపై దూసుకొస్తున్న కాన్వాయ్.. డౌట్ వచ్చి ఆపి చూడగా

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి