కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా దద్దరిల్లిన డీజే పాటలు, రాజకీయ నినాదాలు..!
వరంగల్ జిల్లాలోని కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతర రాజకీయ ప్రభబండ్ల ప్రదర్శన దద్దరిల్లింది.. ఏడేళ్ల తర్వాత మళ్లీ రాజకీయ ప్రభబండ్లు మెరిశాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి కాంగ్రెస్ - బీఆర్ఎస్ భారీ ప్రభ బండ్లు, డీజే పాటలతో సై అంటే సై అనుకునేలా ప్రదర్శన చేశారు.
వరంగల్ జిల్లాలోని కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతర రాజకీయ ప్రభబండ్ల ప్రదర్శన దద్దరిల్లింది.. ఏడేళ్ల తర్వాత మళ్లీ రాజకీయ ప్రభబండ్లు మెరిశాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి కాంగ్రెస్ – బీఆర్ఎస్ భారీ ప్రభ బండ్లు, డీజే పాటలతో సై అంటే సై అనుకునేలా ప్రదర్శన చేశారు..ఉత్కంఠ భరితంగా జరిగిన జాతరలో ఎలాంటి అల్లర్లు లేకుండా ప్రభబండ్ల ఆధిపత్య ప్రదర్శన ముగియడంతో పోలీసులు, అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు..మరి వీరికి కోడ్ ఉల్లంఘన వర్తించదా..?
హోలీ పండుగ నుండి మొదలుకుని మూడురోజుల పాటు కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతర మహా వైభవంగా జరుగుతుంది. ఈ జాతర సందర్భంగా రాజకీయ పార్టీలు వారి ఆధిపత్య ప్రదర్శన చేయడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే ఏడేళ్ల క్రితం ఈ జాతరలో రాజకీయ పార్టీల ఆధిపత్య ప్రదర్శన సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. రాజకీయ ప్రభబండ్ల ప్రదర్శన సందర్భంగా నేతలు భాహభాహికి దిగడంతో జాతర అదుపు తప్పింది. సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రభ బండ్లకు తప్ప రాజకీయ ప్రభ బండ్లకు ఎలాంటి అనుమతి లేదని అప్పట్లో పోలీసులు ఆంక్షలు విధించారు. జాతర సజావుగా సాగే విధంగా రాజకీయ ప్రభబండ్ల ప్రదర్శనపై నిషేదం విధించారు.
గత ఏడేళ్ల నుండి కొమ్మాల జాతరలో రాజకీయ ప్రభబండ్ల ప్రదర్శనపై నిషేధం కొనసాగుతోంది.. రాజకీయ పార్టీల నేతలు కూడా సాధారణ భక్తులాగా వెళ్లి దర్శనాలు చేసుకొని వస్తుండేవారు. తాజాగా ఎన్నికల కోడ్ తుంగలో తొక్కి ఏడేళ్ల తర్వాత మంగళవారం మళ్లీ రాజకీయ ప్రభబండ్లు మెరిశాయి. హోరాహోరీగా ప్రభ బండ్లు కట్టి ఎవరికివారు వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. నర్సంపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ – బీఆర్ఎస్ నాయకులు జాతరలో వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఎత్తైన ప్రభ బండ్లతో జాతరలో సై అంటే సై అనుకుంటూ వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభబండ్లను ఆ పార్టీ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభ బండ్లను స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు..
డీజే సౌండ్స్‌తో జాతర దద్దరిల్లెలా భారీ ప్రదర్శనలతో కొమ్మాల జాతరలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభలు పొటెత్తాయి. భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. కానీ ఎలాంటి అల్లర్లు లేకుండా ప్రభ బండ్ల ప్రదర్శన ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, జాతర కమిటీ, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…