Telangana Election Result 2023: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హవా చాటుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్

| Edited By: Balaraju Goud

Dec 03, 2023 | 11:35 PM

తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కంచుకోటగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. జిల్లాలో 11 స్థానాలను కైవసం చేసుకుని పూర్వ వైభోవాన్ని చాటుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 11 మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఖంగు తినిపించింది.

Telangana Election Result 2023: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హవా చాటుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్
Komatireddy Brithers
Follow us on

తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కంచుకోటగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. జిల్లాలో 11 స్థానాలను కైవసం చేసుకుని పూర్వ వైభోవాన్ని చాటుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 11 మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఖంగు తినిపించింది. ఈ ఎన్నికల్లో 11 స్థానాలను గెలుచుకుని మరోసారి ఉమ్మడి జిల్లాపై కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిరూపించుకుంది.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రాతినిధ్యం వహిస్తున్న దిగ్గజ నేతలంతా ఈ జిల్లాకు చెందిన వారే. రాజకీయ కాంగ్రెస్ ఉద్దండులు కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ స్థానాలతోపాటు తమ అనుచరులు కూడా గెలిచి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి గెలిచి తమ హవా చాటుకున్నారు. నకిరేకల్ లో వేముల వీరేశం, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, ఆలేరులో బీర్ల ఐలయ్య, తుంగతుర్తిలో మందుల సామేల్ లు గెలవడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ తమ రాజకీయ పట్టును మరోసారి నిరూపించుకున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ గెలుచుకున్న 64స్థానాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పాత్ర కీలకం. 64లో 12స్థానాలు ఉమ్మడి నల్గొండలో ఉంటే.. అందులో 11చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్‌కి కంచుకోటలో అభ్యర్థుల ఎంపిక మొదలు, స్క్రీనింగ్ దాకా తమ సొంత మనుషుల సమర్థతతను అధిష్టానానికి చూపించుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌.. చివరికివాళ్లకే టికెట్లు ఇప్పించుకున్నారు. ఈ మొత్తం అన్నిస్థానాల్లో అభ్యర్థులు తామే అన్నట్లు.. ప్రచారబాధ్యతను భుజానికెత్తుకున్నారు. గెలిపించుకున్నారు.

స్వతహాగా కోమటిరెడ్డి బ్రదర్స్‌ సొంత నియోజకవర్గంమైన నకిరేకల్‌లో పట్టు ఓ రేంజ్‌లో నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ 68వేల పైచిలుకు ఓట్ల బంపర్ మెజార్టీ వచ్చింది నకిరేకల్ నుంచే. గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ అండతో కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన చిరుమర్తి లింగయ్యపై ఈసారి.. అదే కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్‌తో వేముల వీరేశం 68వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ సాధించారు.

ఇక, హుజూర్ నగర్, కోదాడలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తోపాటు ఆయన సతీమణి పద్మావతి కూడా గెలిచి తమ పట్టును నిలబెట్టుకున్నారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటుకు వరకు కూడా తాకనివ్వనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శపథం చేశారు. ఇందుకు అనుగుణంగానే జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రచారం నిర్వహించి అభ్యర్థుల గెలుపునకు దోహదపడ్డారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా మా అడ్డా. అన్ని సీట్లను క్వీన్ స్వీప్ చేస్తాం. మిగతా జిల్లాల్లో రేవంత్ ప్రచారం చేసి గెలిపించాలని అంటూ వచ్చారు. ఇప్పుడు అదే జరిగింది. రేవంత్‌ ఓవైపు తన నియోజవర్గాలైన కొడంగల్, కామారెడ్డితో పాటు రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లోనూ ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంట్రీ ఇచ్చింది మాత్రం చివరి రెండుమూడు రోజుల్లో మాత్రమే. అప్పటి వరకూ తామే అభ్యర్థులం అన్నట్లు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రచారం జరిగింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ వేవ్ చాలా స్పష్టంగా కనిపించినప్పటికీ, సూర్యాపేటలో మాత్రం కాంగ్రెస్ బోల్తా పడింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి జగదీశ్ రెడ్డి విజయం సాధించారు.

2014 ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాల్లో బీఆర్ఎస్ ఆరు కాంగ్రెస్ ఆరు స్థానాలను కైవసం చేసుకున్నాయి. 2018 ఎన్నికల్లో 9 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్గజా నాయకులు కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డిలు పరాజయం పాలయ్యారు. తర్వాత జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ గెలిచి నల్లగొండను గులాబీ కొండగా బీఆర్ఎస్ మార్చింది. 2014, 2018 ఎన్నికల్లో కుదేలైన కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో 11 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ తన ప్రతీకారాన్ని తీర్చుకుంది.

1. నాగార్జునసాగర్ః కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జైవీర్ రెడ్డి – 55,849 ఓట్లతో గెలుపు.

2. మిర్యాలగూడః కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి(BLR) – 48,782 ఓట్లతో గెలుపు.

3. నల్లగొండః కోమటిరెడ్డి వెంకటరెడ్డి – 54,332 ఓట్లతో గెలుపు.

4. మునుగోడుః కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – 40,138 ఓట్లతో గెలుపు.

5. హుజూర్ నగర్ః కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి – 43,959 ఓట్లతో గెలుపు.

6. నకిరేకల్ః కాంగ్రెస్ అభ్యర్ధి వేముల వీరేశం 68,839 ఓట్ల తేడాతో గెలుపు.

7.తుంగతుర్తిః కాంగ్రెస్ అభ్యర్ధి మందుల సామేల్ – 51,094 ఓట్ల తేడాతో గెలుపు.

8. దేవరకొండః కాంగ్రెస్ అభ్యర్ధి బాలు నాయక్ – 30,140 ఓట్ల తేడాతో విజయం..

9. ఆలేరుః కాంగ్రెస్ అభ్యర్ధి బీర్ల అయిలయ్య – 49,656 ఓట్ల తేడాతో గెలుపు.

10. కోదాడః కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి – 57,861 ఓట్లతో గెలుపు.

11. భువనగిరిః కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనిల్ కుమార్ రెడ్డి – 25,761 వేల ఓట్ల తేడాతో గెలుపు.

12. సూర్యాపేట: BRS అభ్యర్ధి జగదీష్ రెడ్డి – 5,637 ఓట్ల తేడాతో గెలుపు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్ :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్ :