AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: హద్దు మీరొద్దు.. మాట జారొద్దు..! తెలంగాణ బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి క్లాస్..

హద్దు మీరొద్దు. మాట జారొద్దు. ఇకపై నేతలెవరూ ఇష్టానుసారంగా మాట్లాడొద్దు. ఇదీ తెలంగాణ బీజేపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇచ్చిన స్వీట్ వార్నింగ్. ఇంతకీ బీజేపీలో పరిస్థితి ఇంతవరకు ఎందుకొచ్చింది. నేతలు నిజంగానే పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారా..? కిషన్ రెడ్డి ఏం చెప్పారు.. ? అనేది ఈ కథనంలో తెలుసుకోండి..

Telangana BJP: హద్దు మీరొద్దు.. మాట జారొద్దు..! తెలంగాణ బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి క్లాస్..
Telangana Bjp
Shaik Madar Saheb
|

Updated on: May 29, 2025 | 9:50 AM

Share

తెలంగాణలోని పలువురు బీజేపీ నేతలకు కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనాయకులతో సమావేశమైన కిషన్ రెడ్డి.. ఎవరికి వాళ్లు ప్రెస్‌మీట్‌లు పెట్టి ఇష్టారీతిన మాట్లాడొద్దని సూచించారు. పార్టీ కార్యాలయంలో పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలని స్పష్టం చేశారు. పార్టీ వేదికపై వ్యక్తిగత అజెండాతో నేతలకు మాట్లాడొద్దని సూచించారు. పార్టీ అజెండానే నేతలు, లీడర్ల అజెండాగా ఉండాలని.. ఈ విషయంలో మరో ఆలోచన ఉండకూడదని క్లారిటీ ఇచ్చారు. ఎవరికి వారు పార్టీ ఆఫీస్‌కు వచ్చి ప్రెస్‌మీట్‌లు పెట్టి వ్యక్తిగత దూషణలు చేయకూడదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై పార్టీ కార్యాలయాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకున్న వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఇది తనతో పాటు అందరికీ వర్తిస్తుందని కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు. బీజేపీ అంటే బాధ్యతగల పార్టీ అని.. సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన పార్టీ అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా పార్టీ ఆఫీస్‌ను ఆశ్రయిస్తున్నారని.. అలాంటి వారికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేసేలా నాయకుల తీరు ఉండాలని నేతలకు వివరించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లోని పరిణామాలపై బీజేపే నేతల వ్యాఖ్యలు

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లోని పరిణామాలపై కొంతమంది బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరిగ్గా లేని కారణంగానే కిషన్ రెడ్డి నేతలకు ఈ రకమైన వార్నింగ్ ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది. కాళేశ్వరం కమిషన్, కవిత లేఖ, కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులతో పాటు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపైనా కొందరు బీజేపీ నేతలు స్పందించారు. అయితే వాళ్ల కామెంట్స్ వ్యక్తిగతమా ? లేక పార్టీ వైఖరి ఇదేనా ? అని తెలియక కేడర్‌లో గందరగోళం నెలకొంది. ఇదే విషయాన్ని పలువురు నేతలు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

కిషన్ రెడ్డి వార్నింగ్‌తో నేతల తీరు మారుతుందా ?

కొంతకాలంగా రాష్ట్రంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అంశాలపై నేతలు ఎవరికి వాళ్లే వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించకూడదని భావించిన బీజేపీ నాయకత్వం.. ఈ విషయంలో కఠినంగా ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే పలువురు సీనియర్ నేతలు సహా అందరికీ ఇదే వర్తిస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పార్టీ నేతలకు కిషన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్‌తో నేతల తీరులో మార్పు వస్తుందా ? ఇకపై కీలక అంశాలపై బీజేపీ నేతలంతా ఒకే రకమైన వైఖరిని వెల్లడిస్తారా ? అన్నది చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..