AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: తెలంగాణకు రూ. 416.8 కోట్ల సాయం.. ప్రధాని మోదీ, అమిత్ షా‌కు కృతజ్ఞతలు తెలిపిన కిషన్ రెడ్డి

వదరల కారణంగా లక్షలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. తినడానికి తిండిలేక, నిలువ నీడ లేక బాధితులు అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో ఇబ్బందులు పడ్డ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం విడుదల చేసింది.

Kishan Reddy: తెలంగాణకు రూ. 416.8 కోట్ల సాయం.. ప్రధాని మోదీ, అమిత్ షా‌కు కృతజ్ఞతలు తెలిపిన కిషన్ రెడ్డి
Modi, Amit Shah, Kishan Reddy
Balaraju Goud
|

Updated on: Oct 01, 2024 | 10:09 PM

Share

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ముంచెత్తిన వదరల కారణంగా లక్షలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. తినడానికి తిండిలేక, నిలువ నీడ లేక బాధితులు అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో ఇబ్బందులు పడ్డ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం విడుదల చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు వరద సాయం అందించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోపాటు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి.

మొత్తం 14 రాష్ట్రాలకు రూ.5,858.60 కోట్లు విడుదల చేసింది కేంద్ర హోంశాఖ. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1,036 కోట్లు కేటాయించింది. అలాగే తెలంగాణకు రూ. 416.80 కోట్లు వరద సాయంగా అందించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ.. వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ నగరం అతలాకుతలమయ్యాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు కారణంగా ఇబ్బందులు పడిన రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వరద సాయం విడుదల చేసింది.

ఈ క్రమంలోనే మొత్తం 14 రాష్ట్రాలకు రూ.5,858.60 కోట్లు విడుదల చేసింది కేంద్రం. ఈ మేరకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ కేంద్ర కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. “ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రాష్ట్రాలకు అచంచలమైన మద్దతు ఇచ్చినందుకు నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.” అని రాసుకొచ్చారు. “తెలంగాణ రాష్ట్రానికి రూ. 416.80 కోట్లతో సహా 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు సకాలంలో నిధులు విడుదల చేయడం వల్ల పునరావాస ప్రయత్నాలను వేగవంతం చేయడంతోపాటు అవసరమైన సామాగ్రి బాధిత వర్గాలకు వేగంగా చేరేలా చేస్తుంది.” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుండి కేంద్ర వాటాగా రూ. 5,858.60 కోట్లు రిలీజ్ చేసింది కేంద్రం. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుండి 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు అడ్వాన్స్ మొత్తాన్ని హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మహారాష్ట్రకు రూ.1,492 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లు, అసోంకు రూ.716 కోట్లు, బీహార్‌కు రూ.655.60 కోట్లు, గుజరాత్‌కు రూ.600 కోట్లు, తెలంగాణకు రూ.416.80 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.468 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో అధిక వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ప్రభావితమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రాష్ట్రాల ప్రజల కష్టాలను తగ్గించడంలో మోదీ ప్రభుత్వం భుజం భుజం కలిపి నిలుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ప్రకటన పేర్కొన్నారు.

ఇదిలావుండగా, వరద ప్రభావిత రాష్ట్రాలైన అస్సాం, మిజోరం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్‌లలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాలను పంపింది. అదనంగా, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో జరిగిన నష్టాన్ని అక్కడికక్కడే అంచనా వేయడానికి అంతర్-మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాలను త్వరలో పంపనున్నారు. ఈ రెండు రాష్ట్రాలు ఇటీవల వరదల బారిన పడ్డాయి. ఈ ఏడాది 21 రాష్ట్రాలకు రూ.14,958 కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..