Telangana: ఇన్ డైరెక్ట్ పంచ్‌లు.. కాంట్రావర్సీ స్టేట్ మెంట్లు.. ఆపై అసంతృప్తి ట్విట్లు.. బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కిషన్ రెడ్డి..
గతంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ నుంచి రాష్ట్ర పార్టీ పగ్గాలను తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు కిషన్ రెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణ, మాజీ సీఎంలు కిరణ్ కుమార్ రెడ్డి, నాదేండ్ల భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు..
హైదరాబాద్, జూలై 21: నలుగోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు భాగ్యలక్ష్మీ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అంబర్ పేట లో జ్యోతిరావు పూలే విగ్రహానికి, లిబర్టీ అంబేద్కర్ విగ్రహానికి, గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. బషీర్ బాగ్ లోని కనకదుర్గా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గన్ పార్క్ నుంచి బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా హోమం చేశారు. గతంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ నుంచి రాష్ట్ర పార్టీ పగ్గాలను తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు కిషన్ రెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణ, మాజీ సీఎంలు కిరణ్ కుమార్ రెడ్డి, నాదేండ్ల భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం పార్టీ కార్యాలయం బయట ఏర్పాటు చేసిన సభ హాట్ హాట్ గా సాగింది. తన మీద సొంత పార్టీలోనే కొందరు హైకమాండ్‌కు ఫిర్యాదులు చేశారని బండి చెప్పుకొచ్చారు. కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టిన కిషన్ రెడ్డిని అయినా ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలిని చురకలు అంటించారు. కొందరు ఢిల్లీకి తప్పుడు ఫిర్యాదులు చేసి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.
ఇదే సభలో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపి రెండు ఒక్కటి కాదని చెప్పేందుకు.. కేంద్ర దర్యాప్తు సంస్థలపై రాజగోపాల్ తీవ్ర వాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను తప్పించేందుకు.. సీఎం కేసీఆర్ ఈడీని మేనేజ్ చేశారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ సభలో మధ్యలో నుంచే వెళ్లిపోయారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. తెలంగాణ వ్యతిరేకులతో పాటు వేదికపై కార్యక్రమం ముగిసే వరకు కూర్చోలేకపోయానంటూ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి విజయశాంతి ట్విట్ చేయడం కలకలం రేపింది. మొత్తానికి ఈ సభలో బండి, కోమటిరెడ్డి చెప్పాల్సింది చెప్పేశారు.!. విజయశాంతి అసంతృప్తిని ట్విట్ ద్వారా వెల్లగక్కారు.
బీజేపీ రాష్ట్ర పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ప్రసంగించిన కిషన్ రెడ్డి… డైలాగ్ లతో దంచికొట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. యుద్దమంటూ జరిగితే కత్తికైనా కనికరం ఉంటుందేమో కానీ.. తెలంగాణ ప్రజలకు ఉండదంటూ పవర్ ఫుల్ డైలాగ్ వదిలారు. తెలంగాణలో బుల్డోజర్ ప్రభుత్వం రావాలన్నారు తెలంగాణ బీజేపీ సారథి. సమిష్టి నిర్ణయాలతోనే పార్టీని నడిపిస్తానని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పనితీరును కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్, లక్ష్మణ్ తదితర నేతలు ప్రశంసించారు. బండి సంజయ్ ను చూసి కన్నీళ్లు ఆపుకోలేక.. బాత్రూంలోకి వెళ్లి ఏడ్చాను అంటూ వేదికపైనే రాజగోపాల్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. మొత్తానికి రాములమ్మ అలకకు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డే కారణమని తెలిసిపోయింది. మరీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విజయశాంతి నెక్ట్స్ ఏం చేయబోతున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం