Kishan Reddy: మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే అని మరోసారి నిరూపితమైంది.. ‘మహిళా’ బిల్లుపై కిషన్‌ రెడ్డి

|

Sep 21, 2023 | 8:47 AM

ఇక మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై గురువారం రాజ్య సభలో ఓటింగ్‌ జరగనుంది. ఇక్కడ బిల్లుకు ఆమోదం లభిస్తే చట్ట రూపం దాల్చనుంది. ఇదిలా ఉంటే మహిళా రిజర్వేషన్‌ బిల్లులకు లోక్‌ సభలో ఆమోదం లభించడంపై రాజకీయ నాయకులు మొదలు, సామాన్య ప్రజల వరకు హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా బిల్లుకు తమ మద్ధతు ప్రకటించారు. బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు...

Kishan Reddy: మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే అని మరోసారి నిరూపితమైంది.. మహిళా బిల్లుపై కిషన్‌ రెడ్డి
Kishan Reddy
Follow us on

దేశ చరిత్రలో మరో అద్భుత ఘట్టానికి నాంది పడిన విషయం తెలిసిందే. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌ సభలో ఆమోదం లభించింది. నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ పేరుతో ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టగా మెజారిటీ ఎంపీలు అనుకూలంగా ఓటు వేశారు. సుమారు 8 గంటల పాటు చర్చ జరిగిన అనంతరం న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు 454 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం లభించినట్లైంది.

ఇక మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై గురువారం రాజ్య సభలో ఓటింగ్‌ జరగనుంది. ఇక్కడ బిల్లుకు ఆమోదం లభిస్తే చట్ట రూపం దాల్చనుంది. ఇదిలా ఉంటే మహిళా రిజర్వేషన్‌ బిల్లులకు లోక్‌ సభలో ఆమోదం లభించడంపై రాజకీయ నాయకులు మొదలు, సామాన్య ప్రజల వరకు హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా బిల్లుకు తమ మద్ధతు ప్రకటించారు. బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఇక ఇదే విషయమై తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సైతం స్పందించారు. మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే అని మరోసారి నిరూపితమైందని కిషన్‌ రెడ్డి అన్నారు.


చరిత్రాత్మకమైన, ప్రగతిశీలమైన మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు బుధవారం లోక్‌ సభలో ఆమోదం లభించడం సంతోషకరమన్న కిషన్‌ రెడ్డి.. ఇది దేశ చరిత్రలో ఓ కీలకమైన మలుపుగా నిలవబోతోందని అభివర్ణించారు. 75 ఏళ్ల దేశ చరిత్రలో చాలా సార్లు ఈ బిల్లు గురించి చర్చ జరిగిందన్న కిషన్‌ రెడ్డి.. పార్లమెంటులోనూ పలుమార్లు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అయితే రాజ్యసభలో ఓసారి ఆమోదం కూడా పొందింది. కానీ ఈ బిల్లు విషయంలో అంతకుమించి ఒక్క అడుగుకూడా ముందుకు పడకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలే అని విమర్శించారు.

కిషన్ రెడ్డి ట్వీట్..

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మహిళాలోకానికి ఎట్టకేలకు ఓ కానుక లభించింది. లోక్‌సభలో, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకోసం సీట్లు రిజర్వ్ కాబోతున్నాయి. ఈ అద్భుతమైన ప్రగతి సాధించినందుకు దేశ మహిళాలోకానికి కిషన్‌ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ చరిత్రాత్మకమైన బిల్లు లోక్‌సభలో ఆమోదముద్ర పొందడం ద్వారా.. ‘మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే’ అని మరోసారి నిరూపితమైందని, రాజ్య సభలోనూ బిల్లుకు ఆమోదం లభిస్తుందనే సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని కిషన్‌ రెడ్డి చెప్పుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..