Kishan Reddy: తెలంగాణ ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టారు: కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఆగ్రహం..

తెలంగాణ ఆడపడుచులతో విదేశీ వనితల కాళ్లు కడిగించారంటూ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మన ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మిస్ వరల్డ్ పోటీదారులు బుధవారం రామప్ప ఆలయాన్ని సందర్శించారు.

Kishan Reddy: తెలంగాణ ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టారు: కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఆగ్రహం..
G Kishan Reddy

Updated on: May 15, 2025 | 7:03 PM

తెలంగాణ ఆడపడుచులతో విదేశీ వనితల కాళ్లు కడిగించారంటూ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మన ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మిస్ వరల్డ్ పోటీదారులు బుధవారం రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీదారుల పాదాలను.. కొందరు మహిళలతో కడిగించడం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టేట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారానికి ఇది నిదర్శనం అంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

రాణి రుద్రమదేవి ఏలిన గడ్డపై, చారిత్రక రామప్ప ఆలయ ప్రాంగణంలో తెలంగాణ మహిళలను అవమానించడం దురదృష్టకరమని.. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సమ్మక్క, సారలమ్మ పుట్టిన గడ్డపై మహిళలకు అత్యంత తీవ్రమైన అవమానం జరిగిందని.. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అంటూ కిషన్ రెడ్డి అన్నారు. ‘అతిథి దేవో భవ’ మన విధానం.. కానీ అతిథిని గౌరవించే క్రమంలో మన మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించడం క్షమార్హం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతోపాటుగా రేవంత్ రెడ్డి.. భారతీయ మహిళలకు, తెలంగాణ మహిళా సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కిషన్ రెడ్డి ట్వీట్..

మిస్ వరల్డ్ పోటీ 72వ ఎడిషన్ – మిస్ వరల్డ్ 2025 మే 31, 2025న హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది. ఈ క్రమంలో.. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తెలంగాణ ములుగు జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన 800 సంవత్సరాల పురాతన రామప్ప ఆలయాన్ని సందర్శించారు. అయితే.. ఈ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం స్థానిక మహిళలతో మిస్ వరల్డ్ పోటీదారుల పాదాలను కడిగించింది.. ఇది వలసవాద యుగం మనస్తత్వాన్ని ప్రతిబింబించే అవమానకరమైన చర్య.. అంటూ కిషన్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. మిస్ వరల్డ్ వేదిక.. మన భారతీయ సంస్కృతిని – మన ఆతిథ్యాన్ని పోటీదారుల ముందు ప్రదర్శించడానికి ఒక సరైన అవకాశాన్ని ఇచ్చింది.. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ అవకాశాన్ని వృధా చేసింది. ఇది మన మహిళల ఆత్మగౌరవాన్ని దిగజార్చింది, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తుంది.. అంటూ కిసన్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..