AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విడాకులు ఇచ్చానంటూ లేడీ డాక్టర్‏ను ట్రాప్ చేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..

పెళ్లాం కాదు.. నా జీవితానికో గొళ్లెం. ఏడడుగులు నడిచిన పాపానికి ఎంత టార్చర్‌ పెట్టిందో. అందుకే ఆల్రెడీ డైవోర్స్‌కి అప్లై చేశా. ఇదిగో డాక్యుమెంట్స్‌. మనం కొత్త లైఫ్‌ స్టార్ట్‌ చేద్దామని అతను చెబితే.. నిజమేనని నమ్మేసిందా లేడీ డాక్టర్‌. పెళ్లి చేసుకుందామనేసరికి సర్వస్వం అప్పగించింది. గర్భందాల్చాక పెళ్లి గురించి గట్టిగా అడిగితే బయటపడింది ఆ దగుల్బాజీ నిజస్వరూపం..

విడాకులు ఇచ్చానంటూ లేడీ డాక్టర్‏ను ట్రాప్ చేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..
Crime News
Ranjith Muppidi
| Edited By: Shaik Madar Saheb|

Updated on: May 15, 2025 | 7:55 PM

Share

ఢిల్లీవాలా హూ.. దిల్‌వాలా హూ.. అంటూ దగ్గరయ్యాడు. ఆ ముచ్చటకాస్తా తీరిపోయాక కౌన్‌ హై తూ.. అంటూ తోకజాడించాడు. ఢిల్లీకి చెందిన భరత్ గెరా హైదరాబాద్‌ కొండాపూర్ ఏరియాలో ఉంటున్నాడు. బంజారాహిల్స్ డెరేడియా లైఫ్ సైన్స్ హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వెలగబెట్టేవాడు. అక్కడే పరిచయమైంది అతనికో లేడీ డాక్టర్‌. మాటలు కలిశాయి. చూపులు కలిశాయి. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో మ్యాటర్‌ ఫోన్‌కాల్స్‌, షికార్లదాకా వెళ్లింది. ఇద్దరి మధ్యా చనువు మరింత పెరిగింది. పెళ్లి చేసుకుంటానని పోయినేడాది ఏప్రిల్ నెలలోనే లేడీ డాక్టర్‌ని నమ్మించాడు ఢిల్లీవాలా. తనకు పెళ్లయిందని.. భార్యతో సరైన రిలేషన్ లేక డైవోర్స్‌ తీసుకుంటున్నట్లు చెప్పాడు. దానికి సంబంధించిన కొన్ని కాగితాలేవో చూపించాడు. తల్లితో ఆస్తి వివాదాలు ఉన్నట్లు కూడా నమ్మించాడు. దాపరికమేమీ లేదన్నట్లు అన్ని విషయాలూ చెప్పేసి ఆమెని బుట్టలో వేసుకున్నాడు.

కొన్ని నెలల స్నేహంలోనే భరత్‌ గెరాని గుడ్డిగా నమ్మేసిందా డాక్టర్‌. ఈ ఏడాది మార్చి 31న ఆఫీస్ వర్క్‌పై చండీగఢ్‌ వెళ్తున్నానన్న భరత్‌.. ఆమెను కూడా రావాలని కోరాడు. లేడీ డాక్టర్‌తో చండీగఢ్‌ హోటల్‌ రూమ్‌లో దిగాడు. ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నామంటూ ఆమె వారిస్తున్నా లైంగిక దాడి చేశాడు. తర్వాత పర్‌ఫామెన్స్ బాలేక భరత్ ఉద్యోగం ఊడింది. కష్టమైనా నష్టమైనా నీతోనే అంటూ ఆ లేడీ డాక్టర్‌ కూడా జాబ్‌కి రిజైన్ చేసింది. ఇద్దరూ కలిసి బిజినెస్ మొదలుపెట్టి జీవితంలో సెటిల్ అవుదామనుకున్నారు. భరత్‌కి రెండున్నర లక్షల డబ్బుకూడా ఇచ్చిందా లేడీ డాక్టర్‌. ఆ తర్వాత భరత్ ఆమెను అనుమానించడం మొదలెట్టాడు. ఫోన్ లోకేషన్ కూడా ట్రాక్ చేసేదాకా వెళ్లాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి.

ఈ మగాళ్లు ఇంతే.. అనుమానపు పక్షులని సర్దుకుపోయింది. ఈమధ్య భరత్‌ని కలుద్దామని అతని ఇంటికెళ్లిన లేడీ డాక్టర్‌కి షాకింగ్‌ సీన్‌ కనిపించింది. అతని భార్య ఇంట్లోనే ఉంది. పైగా ఆమె గర్భిణి అని తెలియటంతో తను మోసపోయినని తెలుసుకుంది. పైగా మొగుడూపెళ్లాలిద్దరూ ఆమెను చెడామడా తిట్టేసి అక్కడి నుంచి పంపేశారు. తర్వాత భరత్ తన భార్యతో పుణె వెళ్లిపోయాడు. కొన్ని రోజులకు ఆ లేడీ డాక్టర్‌కి ప్రెగ్నెన్సీ కన్‌ఫం అయింది. తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని మోసం చేశాడంటూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.

నమ్మితే బుట్టలో వేసుకోవడానికి, నయవంచన చేయడానికి భరత్‌లాంటి బద్మాష్‌లు సొసైటీలో ఎంతోమందున్నారు. మంచీచెడ్డా చూసుకోకపోతే, వెనకాముందు ఆలోచించకుండా తప్పుటడుగులేస్తే చివరికి బాధపడుతూ కూర్చోవాల్సి వస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..