AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో బిడ్డా.. జలుబు చేసిందని RMP వద్దకు వెళ్తే ఒక్క ఇంజెక్షన్‌తో గిలగిలాకొట్టుకుంటూ..

బోనాల పండగకు హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చిన 14 ఏళ్ల హేమశ్రీ జలుబు, దగ్గుతో అనారోగ్యానికి గురైంది. తల్లిదండ్రులు స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా ఇంజక్షన్‌ ఇచ్చిన తర్వాత బాలిక స్పృహ కోల్పోయి మృతి చెందింది. ఆర్‌ఎంపీ నిర్లక్ష్యమే కారణమని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయ్యో బిడ్డా.. జలుబు చేసిందని RMP వద్దకు వెళ్తే ఒక్క ఇంజెక్షన్‌తో గిలగిలాకొట్టుకుంటూ..
Khammam Girl Death, RMP Injection
SN Pasha
|

Updated on: Aug 11, 2026 | 6:10 AM

Share

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోనాల పండగ సందర్భంగా హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చిన 14 ఏళ్ల బాలిక స్వల్ప అనారోగ్యంతో స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లగా.. చికిత్సలో భాగంగా ఇంజక్షన్‌ ఇచ్చిన అనంతరం మృతి చెందింది. ఆర్‌ఎంపీ నిర్లక్ష్యమే తమ కుమార్తె మృతికి కారణమంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బస్వాపురానికి చెందిన చల్లా రమేశ్‌, మౌనిక దంపతుల కుమార్తె హేమశ్రీ(14) స్థానిక కస్తూర్బా విద్యాలయంలో ఎనిమిదో తరగతి చదువుతోంది. బోనాల పండగ సందర్భంగా హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చిన హేమశ్రీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది. జాతరలోనూ ఉత్సాహంగా పాల్గొంది. అయితే ఆదివారం ఆమెకు జలుబు, దగ్గు రావడంతో స్వల్పంగా అనారోగ్యానికి గురైంది. పాఠశాలకు తిరిగి పంపించాల్సి ఉండటంతో తల్లిదండ్రులు స్థానికంగా వైద్యం చేసే ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు.

అక్కడ ఆర్‌ఎంపీ హేమశ్రీకి ఓ ఇంజక్షన్‌ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరో ఇంజక్షన్‌ ఇచ్చే సమయంలోనే బాలిక ఒక్కసారిగా స్పృహ కోల్పోయిందని, నోటి నుంచి నురగ వచ్చిందని చెప్పారు. దీంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే హేమశ్రీ మృతిచెందినట్లు వెల్లడించారు. తమ కుమార్తెకు సాధారణ జలుబు, దగ్గు మాత్రమే ఉన్నాయని, ఇంజక్షన్‌ ఇచ్చిన తర్వాతే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆర్‌ఎంపీ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, ఆసుపత్రిలోని సీసీ కెమెరా ఫుటేజీతో పాటు ఇతర వివరాలను పోలీసులు పరిశీలించారు. అనంతరం బాలిక మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుర్తుతెలియని ఇంజక్షన్‌ ఇవ్వడం వల్లే తన కుమార్తె మృతిచెందిందని ఆరోపిస్తూ తండ్రి రమేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సూరజ్‌ తెలిపారు. బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆర్‌ఎంపీ.. ఆమె మృతిచెందిన విషయం తెలిసిన అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us