Pinarayi Vijayan: కేసీఆర్ పోరాటానికి మా మద్దతు ఉంటుంది.. మోడీ ప్రభుత్వంపై కేరళ సీఎం పినరయి విజయన్ ఫైర్..
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన పోరాటానికి తమ మద్దతు ఉంటుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు చాలా మంచి కార్యక్రమమని..
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన పోరాటానికి తమ మద్దతు ఉంటుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు చాలా మంచి కార్యక్రమమని.. ఇలాంటి సంక్షేమ పథకాలను కేరళలోనూ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం పినరయి విజయన్.. మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వంలో రాజ్యాంగ వ్యవస్థలకు పెనుముప్పు పొంచి ఉందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ చేపట్టిన పోరాటానికి తమ మద్దతు ఉంటుందని పినరయి విజయన్ తెలిపారు. ఖమ్మం సభ దేశానికి ఓ దిక్సూచీ లాంటిదని అభివర్ణించారు. తెలంగాణ సాయుధ పోరాటంతో రాచరికాన్ని తరిమికొట్టారని గుర్తు చేశారు కేరళ సీఎం పినరయి విజయన్. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
హిందీని బలవంతంగా రుద్దుతున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ప్రాంతీయ భాషలను కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నారంటూ విజయన్ మండిపడ్డారు. సుప్రీం కోర్టును కూడా నేరుగా కేంద్ర మంత్రులు బెదిరిస్తున్నారు. ఇలాంటి కష్టసమయంలో రాజ్యాంగాన్ని సుప్రీం కాపాడాలి. ఉపరాష్ట్రపతి కూడా సుప్రీంను కించపరిచేలా మాట్లాడారు. దేశంలో పేదరికం పెరిగింది.. సంపద కొద్ది మంది చేతుల్లోనే ఉంది. మోదీ పాలనలో మైనార్టీలు, దళితులపై దాడులు పెరిగాయి. కేరళలో మతతత్వ శక్తుల కుట్రలు తిప్పికొడుతున్నాం. తెలంగాణలో కూడా అదే జరగాలంటూ పినరయి విజయన్ పేర్కొన్నారు.
అసెంబ్లీలను బలహీనం చేసేలా బిల్లుల్ని తొక్కిపెడుతున్నారంటూ విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. వన్ నేషన్- వన్ ట్యాక్స్.. వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంటూ నేరుగా ఫెడరలిజంపై దాడి చేస్తున్నారని విమర్శించారు. ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన సాగుతుందని విమర్శించారు కేరళ సీఎం పినరయి విజయన్. మోదీ కార్పొరేట్లకు తొత్తుగా వ్యవహరిస్తున్నారు. మోదీ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి.. విదేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైనా కేంద్రం పెత్తనం చేస్తోంది. కీలక విషయాల్లో రాష్ట్రాలను సంప్రదించడం లేదని విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌లు బీజేపీ కార్యాలయాలుగా మారాయని విమర్శించారు. అసెంబ్లీలను బలహీనం చేసేలా బిల్లుల్ని తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..