Telangana: ఆ ఊరిపై పగబట్టిన వరుణుడు..! శాంతించమంటూ గ్రామస్తుల విచిత్ర పూజలు, మొక్కులు..
పరిసర గ్రామాలలో వర్షాలు కురిసినా, ఈ గ్రామంపై వరుణ దేవుడు పగబట్టాడా..? అన్నట్టుగా 40 రోజులుగా చుక్క వాన లేదు. దీంతో పంటచేలు ఎండిపోతున్నాయి.

Telangana: ఇక చాలు దేవుడా అంటూ..మొన్నటి వరకు వరుణదేవుడిని వేడుకున్నారు ప్రజలు. శాంతించు..కరుణించు వరుణ దేవుడా అని మొరపెట్టుకున్నారు. ఈ సంవత్సరం అంతటా అధిక వర్షాలే కురిశాయి. కుండపోత వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి కూడా. కొన్ని చోట్ల చెరువులు తెగిపోయాయి. కానీ, ఓ ఊరిలో మాత్రం వర్షం జాడేలేదు. అంతటా అధికవృష్టి, అక్కడ మాత్రం అనావృష్టి తాండవం చేస్తుంది. పక్కనే ఉన్నటువంటి గ్రామాలలో కుంభవృష్టిగా కురిసిన వానలు..ఈ ఊరును మాత్రం కనీసం పలకరించలేదు. ఆ ఊరు ఏదీ..? ఆ కథ ఏంటి అనుకుంటున్నారా..? ఆ విచిత్ర కథ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పెద్ద ఎల్లాపురం అనే ఈ గ్రామంలో 40 రోజులుగా వర్షాలు లేవు. సీజన్ ప్రారంభంలో పడిన వాన మినహా మళ్లీ వర్షాలు పడలేదు. పరిసర గ్రామాలలో వర్షాలు కురిసినా, ఈ గ్రామంపై వరుణ దేవుడు పగబట్టాడా..? అన్నట్టుగా 40 రోజులుగా చుక్క వాన లేదు. దీంతో పంటచేలు ఎండిపోతున్నాయి. పశువుల మేత కూడా ఎండిపోయి పచ్చగడ్డి కరువైంది. చేసేది లేక గ్రామస్తులంతా కలిసి చిన్నా పెద్ద ఐక్యమై కప్పతల్లి ఆట ఆడారు..
ఓ రోకలికి కప్పను కట్టి, పిల్లలు నడుముకు, కాలికి గజ్జెలు కట్టుకుని, కప్పను కట్టిన రరోకలిని భూజాన మోసుకుంటూ డ్యాన్స్‌లు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ కప్పతల్లికి స్నానం చేయించారు. చిన్నారులు కప్పతల్లితో ఇంటిముందుకు రాగానే మహిళలు రోకటి కట్టిన కప్పై నీళ్లు పోసి అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ఇలా ఊరంతా న్యత్యాలు చేస్తూ తిరుగుతూ.. పాటలు పాడుతూ..కప్పతల్లి ఆట ఆడారు. అనంతరం గ్రామ శివారులో ఆ కప్పను వదిలిపెట్టి మొక్కులు తీర్చుకున్నారు.




సాధారణంగా సీజన్‌లో వర్షాలు కురవకపోతే జూన్, జులై నెలలో కప్పతల్లి ఆట ఆడటం సహజం. సెప్టెంబర్‌లో వర్షాలు కురవాలి కప్పతల్లి ఆట ఆడటం వినూత్నంగా కనిపించింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి