Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం.. డ్రోన్లతో నిఘా.. పూర్తి వివరాలు ఇవే..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 58 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉంది.

జూబ్లీహిల్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉండనుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్.. కారు పార్టీకి ఝలక్ ఇచ్చి తమకు ఎదురులేదని నిరూపించుకోవాలని కాంగ్రెస్ వ్యూహ, ప్రతివ్యూహాలు రచించాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల అధికారులు, పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. ఎన్నికల కమిషన్ 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. దాదాపు 5,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 1,761 మంది హైదరాబాద్ సిటీ పోలీస్ బలగాలతో పాటు, అదనంగా 800 మంది కేంద్ర పోలీస్ బలగాలను రంగంలోకి దించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధి వరకు 144 సెక్షన్ విధించారు. ఎన్నికల కమిషన్ 226 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. ఈ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. పోలింగ్ కేంద్రాల వద్ద మొదటిసారిగా డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో సీసీటీవీ మానిటరింగ్‌తో పాటు లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
సాంకేతిక ఏర్పాట్లు, ఈవీఎంల నిర్వహణ
ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు అదనపు ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలు ఎక్కడైనా పనిచేయడం ఆగిపోతే, వాటి స్థానంలో ఉపయోగించేందుకు బ్యాకప్ ఈవీఎంలను అందుబాటులో ఉంచారు. ఈసీఐఎల్, ఈవీఎం టెక్నికల్ ఇంజనీర్లను సమస్యల పరిష్కారం కోసం పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంచారు. ఈ నెల 14న ఉపఎన్నిక కౌంటింగ్ జరగనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
