
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోరు చూపించాలని వ్యూహాలు రచిస్తోంది. ఫలితాల్లో రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ కూడా పురపాలక ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. అటు బీజేపీ కూడా తగ్గేదేలేదంటోంది. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కావడంతో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణలోని మూడు పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. అయితే ఈ ట్రయాంగిల్ ఫైట్‌లోకి తాను కూడా ఎంటర్ అవుతున్నట్టు ప్రకటించింది పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ. త్వరలో జరగబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని.. రాష్ట్రంలోని జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది జనసేన. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలతో పని చేయాలనుకునే నాయకులు, కార్యకర్తలకు జనసేనలో చేరేందుకు స్వాగతం పలుకుతున్నట్లు చెబుతోంది ఆ పార్టీ.
మున్సిపల్ ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ..సాధ్యమైనన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగుతారని ప్రకటించింది జనసేన. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పవన్ కల్యాణ్ భావజాలాన్ని, ఆశయాలను, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయనకున్న అనుబంధాన్ని ప్రజలకు చేరవేస్తామని.. తద్వారా తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపింది. ఈ ఎన్నికల ప్రచారంలో జనసైనికులు, వీరమహిళలు పాల్గొవాలని పిలుపునిచ్చింది పార్టీ అధిష్టానం. ఇటీవల కొండగట్టులో పర్యటించి కేడర్‌లో ఉత్సాహం నింపిన పవన్ కల్యాణ్.. తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేస్తామని అప్పుడే సంకేతాలు ఇచ్చారు.
తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇస్తున్న జనసేన.. ఈసారి సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. జనసేన ప్రకటనతో బీజేపీ స్టాండ్ ఏంటనేది ఆసక్తిరేపుతోంది. ఏపీ అధికార కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన పార్టీలు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటే చేస్తాయా..లేక విడివిడిగా బరిలోకి దిగుతాయా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే ఒంటరిగానే అన్నది బీజేపీ లైన్. మార్పులు చేర్పులుంటే జాతీయ స్థాయిలో నిర్ణయం అవసరం అని చెబుతున్నారు కాషాయపార్టీ నేతలు. మొత్తానికి మూడు పార్టీల ట్రయాంగిల్ ఫైట్ నెలకొన్న వేళ జనసేన బరిలోకి దిగుతుండటంతో తెలంగాణ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..