తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు ఫిక్స్ అయ్యిందా? ఇక మిగిలింది అధికారిక ప్రకటనేనా? సీనియర్ నాయకుడు జానారెడ్డి మాటలతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. అయితే తాను అలా అనలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారాయన. అయినప్పటికీ.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందా? అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే అసలు కథేంటి అనేదానిపై ప్రత్యేక స్టోరీ చూద్దాం..
రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగే క్రమంలో పార్టీని విస్తరిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో సభలు, సమావేశాలు పెట్టి నాయకులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇంతకాలం కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలను కలిసి కూటమిగా కోసం ప్రయత్నించారు. తాజాగా అదాని అంశం, రాహుల్ అనర్హతతో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. కాంగ్రెస్ కూడా విపక్షాలతో కలిసి పోరాటాలు చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తీకి నెమ్మదిగా సంకేతాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు అనేది.. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారన్నారు.
అయితే, కాంగ్రెస్ బీఆర్‌ఎస్ పార్టీ పొత్తు విషయంలో జానారెడ్డి వదిలిన మాటలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. దాంతో జానారెడ్డి వెంటనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ పరిరక్షణ కోసం బీజేపీకి వ్యతిరేకంగా 17 పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని మాత్రమే చెప్పానని, ఎక్కడా కూడా బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని తాను చెప్పలేదని వివరణ ఇచ్చారు జానారెడ్డి. పొత్తుల విషయం అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అన్నారాయన.
అటు కాంగ్రెస్ కేడర్ కూడా పొత్తులపై అప్పుడప్పుడు మాటలతూటలు పేలుస్తూనే ఉన్నారు. ఒకవేళ తెలంగాణలో హంగ్ వస్తే, సెక్యులర్ పార్టీలైనా కాంగ్రెస్ బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకోవాల్సిందేనన్నారు ఆ మధ్య కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఇక బీజేపీని అంతం చేసేందుకు అన్నీ పార్టీలతో కలిసి ఐక్య ఉద్యమం చేస్తామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి రాజకీయ పార్టీ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు జీవన్‌రెడ్డి. మొత్తానికి జానారెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, అయినప్పటికీ కొట్టిపారేయ్యలేమని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..