Telangana: ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో అంటే?
రాష్ట్రంలోని ప్రజలకు తక్షణ న్యాయం జరగాలనే ఉద్దేశంతో దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ సీఐడీ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళలు, చిన్న పిల్లల కేసుల్లో తక్షణ ఊరట లభించేలా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసే సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విధానం వల్ల దర్యాప్తులో జాప్యం తగ్గుతుందని, సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా రక్షించవచ్చని సీఐడీ తెలిపింది

హైదరాబాద్, జనవరి 21: బాధితులకు మరింత చేరువగా, మానవీయ కోణంలో సేవలందించేందుకు తెలంగాణ రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బాధితులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. పోలీసులే బాధితులు నివాసానికి లేదా వారు కోరిన ప్రదేశానికి వెళ్లి ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసే కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొదటిసారిగా పౌర కేంద్రిత పోలీసింగ్లో భాగంగా ఈ విప్లవాత్మక మార్పును తీసుకొచ్చినట్లు సీఐడీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఏయే కేసుల్లో ఇంటి వద్దనే ఎఫ్‌ఐర్ నమోదు చేస్తారు.
- మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు,
- శారీరక దాడులు,
- ఆస్తి సంబంధిత వివాదాల్లో బాధితులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతుంటారని పోలీసులు గుర్తించారు.
- పోక్సో (POCSO) చట్టం,
- ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం.
- బాల్య వివాహాల నిషేధ చట్టం
- ర్యాగింగ్ నిరోధక చట్టం
ఒక్క ఫోన్‌తో ఇంటి వద్దకే పోలీసులు
పైన పేర్కొన్న అన్ని కేసుల్లో బాధితులు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడం ఇబ్బందిగా మారుతున్న తరుణంలో, వారి ఇంటి వద్దే ఫిర్యాదు స్వీకరించి న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. ఏదైనా నేరం జరిగినప్పుడు బాధితులు ఫోన్ ద్వారా లేదా మౌఖికంగా సమాచారం అందిస్తే చాలు. వెంటనే సంబంధిత పోలీస్ అధికారి బాధితుడి నివాసానికి లేదా ఘటనా స్థలానికి లేదా వారు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకుంటారు. బాధితుల వద్దే ఫిర్యాదు స్వీకరించి, వెంటనే స్టేషన్ పంపి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ ప్రతిని బాధితులకు వారి ఇంటి వద్దే అందజేస్తారు. భారతీయ నాగరిక సురక్తా సంహిత (BNSS) నిబంధనల ప్రకారం అక్కడికక్కడే సాక్ష్యాల సేకరణ, బాధితుల స్టేట్మెంట్ రికార్డింగ్ వంటి చర్యలు చేపడతారు.
పారదర్శకత – వేగవంతమైన దర్యాప్తు
సమాచారం అందిన వెంటనే స్పందించి, ‘జీరో ఎఫ్ఐఆర్’ సహా ఏ రూపంలోనైనా కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విధానం వల్ల దర్యాప్తులో జాప్యం తగ్గుతుందని, సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా రక్షించవచ్చని సీఐడీ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలిస్ యూనిట్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHO) ఈ నూతన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) పాటించాలని స్పష్టం చేసింది. బాధితుల గౌరవానికి, హక్కులకు భంగం కలగకుండా వృత్తిపరమైన సేవలు అందించడమే లక్ష్యమని సిఐడి తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
