అంత్యక్రియల వేళ అనుకోని ఘటనతో.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గోపాల్ రావుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనారోగ్యంతో ఓ వ్యక్తి మృతిచెందాడు.. ఈ క్రమంలో మృతి చెందిన వ్యక్తి అంతిమయాత్ర సందర్భంగా డప్పు కొడుతున్న వ్యక్తికి గుండె పోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అది చూసిన మరో వ్యక్తికి గుండెపోటు రావడంతో.. అక్కడికక్కడే కుప్పకూలాడు.. దీంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.. ఇద్దరు మృతిచెందడం.. మరొకరు తీవ్రమైన పరిస్థితిలో ఆసుపత్రిలో చేరడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది..
వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం గోపాలరావ్ పల్లి గ్రామానికి చెందిన మునిగి అంతయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. అంతయ్య అంత్యక్రియల కోసం మంగళవారం రోజున ఏర్పాట్లు చేసుకొని గ్రామంలో శవయాత్ర చేస్తున్నారు. డప్పు చప్పుళ్లతో అంతయ్య మృతదేహాన్ని తీసుకెళ్తుండంగా మార్గ మధ్యలో డప్పు కొడుతున్న ఎడ్ల శంకర్ అనే వ్యక్తి అకస్మాత్తుగా కిందపడిపోయాడు.. గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు.. దీంతో అక్కడ ఉన్న వారందరూ పట్టుకొని పక్కకు తరలించి మొహం పై నీళ్లు చల్లి లేపే ప్రయత్నం చేసారు. ప్రాథమిక చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.. అప్పటికే శంకర్ మృతి చెందాడు.
శంకర్ మృతి చెందిన ఘటన చూసిన తంగళ్ళపల్లి ఎంపీటీసీ మునిగే దుర్గాప్రసాద్ హఠాత్తుగా కిందపడిపోయాడు.. అతనికి గుండెపోటు రావడంతో అక్కడ ఉన్నవారు దుర్గాప్రసాద్ కు ప్రాథమిక చికిత్స అందించి సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం అతనికి చికిత్స అందుతోంది. అన్న అంతయ్య శవ యాత్ర చేస్తున్న క్రమంలో ఎడ్ల శంకర్ మృతి చెందడం, దుర్గ ప్రసాద్ కు గుండెపోటు రావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..