Food Poisoning in TS Gurukulas: 50 రోజుల్లో 135 మంది గురుకుల విద్యార్ధులకు ఫుడ్ పాయిజన్‌.. ఒకరు మృతి! ‘సర్కార్ నిద్రపోతోందా?’

|

Apr 21, 2024 | 9:11 AM

తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప‌లు గురుకుల సంక్షేమ విద్యాల‌యాల్లో విద్యార్ధులు గత కొన్ని రోజులుగా వరుసగా అస్వస్థత‌కు గుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. పలు చోట్ల విద్యార్ధులు ఫుడ్ పాయిజ‌న్ కార‌ణంగా ఆస్పత్రి పాలవుతున్నారు. గ‌త 50 రోజుల్లో ఇలా దాదాపు 135 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థత‌తో ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో భువ‌న‌గిరి గురుకుల పాఠ‌శాల‌లో 7వ తరగతి చదువుతున్న ప్రశాంత్ (13) అనే విద్యార్ధి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి..

Food Poisoning in TS Gurukulas: 50 రోజుల్లో 135 మంది గురుకుల విద్యార్ధులకు ఫుడ్ పాయిజన్‌.. ఒకరు మృతి! సర్కార్ నిద్రపోతోందా?
Food Poisoning in TS Gurukula Schools
Follow us on

హైద‌రాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప‌లు గురుకుల సంక్షేమ విద్యాల‌యాల్లో విద్యార్ధులు గత కొన్ని రోజులుగా వరుసగా అస్వస్థత‌కు గుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. పలు చోట్ల విద్యార్ధులు ఫుడ్ పాయిజ‌న్ కార‌ణంగా ఆస్పత్రి పాలవుతున్నారు. గ‌త 50 రోజుల్లో ఇలా దాదాపు 135 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థత‌తో ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో భువ‌న‌గిరి గురుకుల పాఠ‌శాల‌లో 7వ తరగతి చదువుతున్న ప్రశాంత్ (13) అనే విద్యార్ధి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర సర్కార్ దీనిపై దృష్టి పెట్టక పోవడం విడ్డూరంగా ఉందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. నెలన్నర రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం దుమారం లేపుతోన్న తెలంగాణ‌ విద్యాశాఖ మంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధుల భద్రత దృష్ట్యా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఏప్రిల్‌ నేలలోనే ఇప్పటి వరకూ నలుగురు విద్యార్ధులకు ఫుడ్‌ పాయిజన్‌ అవడం గమనార్హం.

శుక్రవారం పెద్దపల్లి సుల్తానాబాద్‌లోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో 20 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు కావడంతో సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. వాతావరణంలోని వేడిగాలుల పరిస్థితులే ఈ ఘటనకు కారణమని పాఠశాల అధికారులు ఆరోపిస్తున్నారు. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే (శనివారం) నిర్మల్‌లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కేజీబీవీ హాస్టల్‌లోని 11 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఏప్రిల్ 3వ తేదీన అదే హాస్టల్‌లో 25 మంది విద్యార్థులు ఉదయం అల్పాహారం తినడంతో అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో హాస్టల్‌ ఇన్‌ఛార్జ్‌తోపాటు, వంట చేసిన వ్యక్తి, అకౌంటెంట్‌ను సస్పెండ్ చేశారు. ఇది జరిగిన మూడు వారాల్లోనే ఇదే హాస్టల్‌లో మరోమారు ఫుడ్ పాయిజన్‌ అయ్యింది.

ఏప్రిల్ 11న యాదాద్రి భోంగీర్‌లోని సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత మరో 16 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. మార్చి 22న జనగాంలోని పెంబర్తి గ్రామంలోని బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TSWREIS)కిచెందని ఐదుగురు విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌తో ఆస్పత్రి పాలయ్యారు. జనవరిలో నిర్మల్‌లోని ముధోలు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 76 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరంతా వికారం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఆస్పత్రుల్లో చేరారు. హాస్టల్‌లో పరిశుభ్రత పాటించకపోవడం, విద్యార్థులకు అందించే ఆహారం అపరిశుభ్రంగా ఉండటం, విద్యాసంస్థల అధికారుల వైఫల్యం వల్ల వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నా జిల్లా అధికారులు నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిద్ర పోతోందని, హాస్టళ్ల దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్‌ నేత , మాజీ మంత్రి టీ హరీశ్‌రావు మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చేరిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.