AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIIT Allahabad క్యాంపస్‌లో తెలంగాణ విద్యార్ధి ఆత్మహత్య.. ఐదో అంతస్తు నుంచి దూకి సూసైడ్!

అలహాబాద్‌ IIITలో తెలంగాణ విద్యార్థి శనివారం రాత్రి సూసైడ్‌ చేసుకున్న తీవ్ర కలకలం రేపింది. ట్రీపుల్‌ ఐటీలో ఫస్ట్ ఇయర్‌ చదువుతున్న విద్యార్ధి రాహుల్‌ ఆదివారం పుట్టినరోజు జరుపుకోనున్నాడు. కానీ ఏం జరిగిందో తెలియదుగానీ ఒకరోజు ముందే అతడు ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని..

IIIT Allahabad క్యాంపస్‌లో తెలంగాణ విద్యార్ధి ఆత్మహత్య.. ఐదో అంతస్తు నుంచి దూకి సూసైడ్!
IIIT Allahabad Student suicide
Srilakshmi C
|

Updated on: Mar 31, 2025 | 8:42 AM

Share

ప్రయాగ్‌రాజ్, మార్చి 31: అలహాబాద్‌ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లో తెలంగాణ విద్యార్థి శనివారం రాత్రి సూసైడ్‌ చేసుకున్నాడు. ప్రయాగ్‌రాజ్‌లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న హాస్టల్ క్యాంపస్‌లోనే విద్యార్ది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. తెలంగాణకు చెందిన వికలాంగ విద్యార్థి రాహుల్ మాదల చైతన్య (21) అలహాబాద్‌ ట్రీపుల్‌ ఐటీలో ఫస్ట్ ఇయర్‌ చదువుతున్నాడు. ఆదివారం పుట్టినరోజు కాగా.. ఒకరోజు ముందు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే రాహుల్ పరీక్షలో ఫెయిల్‌ అవడం వల్ల మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

శనివారం రాత్రి 11.55 గంటల ప్రాంతంలో రాహుల్ IIIT క్యాంపస్‌లోని తన హాస్టల్ ఐదవ అంతస్తు నుంచి కిందకి దూకాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసు సంఘటన స్థలానికి చేరుకుని రాహుల్‌ను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని ధూమంగంజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) అజేంద్ర యాదవ్ తెలిపారు. ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో గత రెండు మూడు రోజులుగా విద్యార్థి తీవ్ర ఆవేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నాడని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

తెలంగాణలో నివాసం ఉంటున్న విద్యార్థి కుటుంబ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. రాహుల్ తల్లి స్వర్ణలత మాట్లాడుతూ.. తన కొడుకు నుండి చివరిసారిగా శనివారం రాత్రి తనతోమాట్లాడినట్లు తెలిపారు. తమ్ముడిని, తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ మెసేజ్‌కూడా పంపించాడని కన్నీరుమున్నీరయ్యారు. ఆ మెసేజ్ చూసి భయపడి వెంటనే కాల్ చేసాను కానీ రాహుల్ ఫోన్ స్విచ్ఛాఫ్‌ వచ్చిందని అన్నారు. అనంతరం రాహుల్ ఫ్రెండ్‌కి కాల్ చేశానని, అతడు మరో విద్యార్ధిని అడగడం విన్నానని, ఆ తర్వాత అతను అకస్మాత్తుగా కాల్ డిస్‌కనెక్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇది జరిగిన 10 నిమిషాల తర్వాత అతను నాకు ఫోన్ చేసి, నా కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పాడని ఆమె తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం క్యాంపస్‌కు చేరుకున్న తర్వాతే రాహుల్‌ ఆత్మహత్య గురించి తమకు తెలిసిందని స్వర్ణలత రోధించారు. గత 6 నెలలు రాహుల్ క్లాసులకు హాజరుకావట్లేదని, దీని గురించి ఇన్‌స్టిట్యూట్ తమకు సమాచారం అందించలేదని తెలియజేసిందని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

‘నా కుమారుడు ఎక్కువగా మాట్లాడడు.. కానీ చాలా మంచివాడు’

తమ కుమారుడు రాహుల్ మంచి విద్యార్థి అని, గతేడాది JEE మెయిన్స్ పరీక్షలో 52వ ర్యాంకు సాధించాడని ఆమె చెప్పింది. రాహుల్ తండ్రి తెలంగాణలో టిఫిన్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరి ఇద్దరు కుమారులలో రాహుల్ పెద్దవాడు. తన కొడుకు ఎక్కువగా మాట్లాడేవాడు కాదని, చదువుకు, టీవీ చూడటం, ఫోన్ బ్రౌజ్ చేయడం మాత్రమే చేసేవాడని, బయట తిరగడం రాహుల్‌కు ఇష్టం ఉండదని అన్నారు. రాహుల్‌ని స్పీచ్ థెరపీకి కూడా తీసుకెళ్లామన్నారు. ఏదైనా మంచి ఫుడ్ తిన్నా, క్లాస్‌లో ఏదైనా విశేషం జరిగితే తమతో పంచుకునేవాడని, ఫోన్‌లో కూడా తమతో చాట్ చేసేవాడని ఆమె చెప్పింది. గత గురువారం రాత్రి రూ. 500 అడిగితే.. ఆ డబ్బులు కూడా పంపానని, నా కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, క్యాంపస్‌లో ఏదో జరిగి ఉంటుందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మరో వైపు రాహుల్ ఆత్మహత్యపై క్యాంపస్‌లో విద్యార్థులు నిరసన చేపట్టారు. సంఘటన స్థలంలో శాంతి భద్రతలు కాపాడేందుకు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించినట్లు యాదవ్ అన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశామని, ఏడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు IIIT ఇన్‌స్టిట్యూట్ ఓ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.