Ibrahimpatnam: పెరుగుతున్న ఇబ్రహీంపట్నం బాధితుల సంఖ్య.. మరో ఆరుగురికి నిమ్స్‌లో చికిత్స..
రెండు రోజుల వ్యవధిలో ఒకరితర్వాత ఒకరుగా.. నలుగురు మరణించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే.. మరికొంతమంది మహిళల ఆరోగ్యం కూడా విషమంగా మారడంతో వారందరినీ హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు.

Ibrahimpatnam Family planning operation failed incident : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విఫలమై.. నలుగురు మహిళలు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాగా.. రెండు రోజుల వ్యవధిలో ఒకరితర్వాత ఒకరుగా.. నలుగురు మరణించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే.. మరికొంతమంది మహిళల ఆరోగ్యం కూడా విషమంగా మారడంతో వారందరినీ హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఇబ్రహింపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరషన్లు చేయించుకున్న మరో ముగ్గురు మహిళలను నిమ్స్‌కు తరలించారు. దగ్గు, ఆయాసంతో బాధపడుతున్న ఇద్దరు మహిళలను నిమ్స్ స్పెషాలిటీ బ్లాక్ లో చికిత్స అందిస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారిలో మొత్తం ఆరుగురికి నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా.. ఈ ఘటనపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అనుభవం ఉన్న సర్జన్‌తోనే 34 ఆపరేషన్లు చేశామని పేర్కొన్నారు. ఆపరేషన్లు పూర్తి అయిన అనంతరం మహిళందరికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి ఇండ్లకు పంపించడం జరిగిందన్నారు. ఆ తర్వాత మహిళలు 26, 27 తేదీల్లో గ్యాస్ట్రో లక్షణాలపై ఫిర్యాదు చేశారన్నారు. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారని.. ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడం జరిగిందన్నారు. ఆపరేషన్లు చేయించుకున్న 34 మందిలో నలుగురు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారని ఇది బాధాకరమైన విషయమన్నారు.
మిగతా 30 మందిని నిన్న నుంచి స్క్రీనింగ్ చేస్తున్నామని, ఇండ్లకు ప్రత్యేక బృందాలను పంపి ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని, అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వారి పిల్లల చదువులకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
