బీజేపీ సస్పెండెడ్ లీడర్, ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చునని అన్నారు. అంటే తదుపరి ఎన్నికల తరువాత ఏర్పడే అసెంబ్లీకి తాను రాకపోవచ్చునని అన్నారు రాజాసింగ్. అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారాయి. ఆదివారం అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాల్లో మాట్లాడిన ఎమ్మెల్యే రాజాసింగ్.. ఇంటా బయటా తనను అసెంబ్లీకి రావొద్దనే కోరుకుంటున్నారని అన్నారు. ‘నేను వచ్చేసారి అసెంబ్లీకి రాకపోవచ్చు. రానున్న ఎన్నికల్లో గోషామహల్‌లో ఎవరు గెలుస్తారో తెలియదు. నేను మాత్రం తిరిగి అసెంబ్లీకి రాననే అనిపిస్తుంది. నేను అసెంబ్లీకి రావొద్దని చాలా రాజకీయాలు చేస్తున్నారు. ఇంటా బయటా అందరూ నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అసెంబ్లీకి వచ్చినా, రాకపోయినా.. గోషామహల్ నియోజకవర్గ ప్రజల కోసం నేనుంటా. వచ్చే ఎన్నికల్లో నేను గెలిచినా, ఓడినా.. ముఖ్యమంత్రి మాత్రం గోషామహల్ నియోజకవర్గ ప్రజలపై దయ చూపాలని వేడుకుంటున్నా.’ అని రాజాసింగ్ అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదిలాఉంటే.. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిదే. అయితే, ఈ సస్పెన్షన్ ఇప్పటికీ ఎత్తివేయలేదు. ఇప్పటికీ ఆయనపై పార్టీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటికైనా సస్పెన్షన్ ఎత్తివేస్తారని భావిస్తుండగా.. పార్టీ జాతీయ నాయకత్వం మాత్రం ఏమాత్రం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఆయన పార్టీ కూడా మారుతారనే ప్రచారం కూడా జరిగింది. టీడీపీలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగగా.. ఆ ప్రచారాన్ని రాజాసింగ్ ఖండించారు. తాను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది టీడీపీ ద్వారానే అయినప్పటికీ.. ఆ పార్టీలో చేరబోనని స్పస్టం చేశారు. ఉంటే బీజేపీలో ఉంటా.. లేదంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానంటూ స్పష్టం చేశారు రాజాసింగ్.
ఇక ఈ సస్పెన్షన్ వ్యవహారంతోనే.. ఇటీవల అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ సైతం సెటైర్లు వేశారు. విపక్ష నేతలు ఒక్కొక్కరు 30 రోజులు, 40 సభ నిర్వహించాలని కోరతారు కానీ, ఒక్కో పార్టీ ఒక్కో సభ్యుడు మాత్రమే ఉన్నారంటూ సెటైర్ వేశారు. ఇంతలో కల్పించుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్.. బీజేపీలో తాను సైతం ఉన్నానంటూ బదులిచ్చారు. మరి మంత్రి ఊరుకుంటేనా.. ‘ఆగండి ఆగండి.. మీరు బీజేపీలో లేరు. మిమ్మల్ని పార్టీ సస్పెండ్ చేసింది కదా? ఆ విషయం మరిచారా?’ అంటూ పంచ్ వేశారు. దాంతో రాజాసింగ్ షాక్ అయ్యారు.
ఇదిలాఉంటే.. తాజాగా రాజాసింగ్ నియోజకవర్గమైన గోషామహల్‌ను బేస్ చేసుకుని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. మంత్రి కేటీఆర్ గోషామహల్‌లో పోటీ చేయాలని సవాల్ విసిరారు బండి సంజయ్. రాజాసింగ్ ధర్మం కోసం పోరాడే వ్యక్తి అని.. ఆయన అనుచరులు దేనికైనా తెగిస్తారన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..